విద్యారంగ ప్రగతికి ఏఐ అవసరమే!

by Disha edit |
విద్యారంగ ప్రగతికి ఏఐ అవసరమే!
X

దేశాభివృద్ధికి దోహదపడే ప్రకృతి సిద్ధమైన భౌతిక వనరులతో పాటు మానవ వనరుల లభ్యత కూడా కీలకమైనది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో అరుదైన యువ శక్తి విలువైన వనరుగా మనకు లభించింది. ఆ యువతను అన్ని విధాల సమర్ధవంతంగా తీర్చిదిద్దే శక్తి నాణ్యమైన విద్యారంగానికి మాత్రమే ఉంది. గడిచిన దశాబ్ద కాలంలో మన దేశ యువతను కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలకు తగినట్లు తీర్చిదిద్దే ఆవశ్యకత ఏర్పడింది. దీనికోసం 'నూతన విద్యా విధానం 2020' పెద్దపీట వేసింది. ఇటీవల కాలంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలోకి 'కృత్రిమ మేధ' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏ.ఐ.) అనేది వేగంగా దూసుకొస్తుంది. గడచిన రెండేళ్లలో దీన్ని ఇతర రంగాలతో పాటు విద్యారంగంలో కూడా ఉపయోగిస్తున్నారు.

మనిషిలాగా ఆలోచించే యంత్రం!

కృత్రిమ మేధను ఒక రకమైన కంప్యూటర్ బ్రెయిన్ కలిగిన మర మనిషి (రోబో)గా చెప్పుకోవాలి. ఎలాగైతే వ్యక్తులు బయట ప్రపంచాన్ని చూసి అనేక విషయాలను స్వయంగా నేర్చుకుంటారో, అదే తరహాలో కంప్యూటర్ కూడా తనకు తానుగా అనేక భాషలను, విషయాలను(సబ్జెక్ట్స్‌ను) వేగంగా నేర్చుకుని, స్వయంగా ఆలోచించి పని చేయగలగడాన్నే... కృత్రిమ మేధ. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏమిటంటే.. కంప్యూటర్కు ప్రోగ్రామర్ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేసి ఇస్తే... దాన్ని మాత్రమే అది సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) అనేది అలాంటిది మాత్రమే కాదు. ఒక పనిని రిపీటెడ్‌గా చేయడం ద్వారా దాన్ని ఇంకా మెరుగైన విధంగా, మంచిగా చేసేందుకు అది స్వయంగా ఆలోచిస్తుంది. తన తప్పులను తానే సరిచేసుకుంటూ ఆ పనిని మరింత సమర్థవంతంగా ఎలా పనిచేయాలో అదే స్వయంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుంది.వ్యక్తి మెదడు మాదిరిగానే కృత్రిమ మేధస్సు కూడా స్వయంగా ఆ

లోచించి నిర్ణయాలు తీసుకుని పనిచేసే యంత్రం. వ్యక్తి మెదడు కొన్ని లక్షల న్యూరాన్‌లతో సంబంధం కలిగి ఉన్నట్లు ఏఐ కూడా ప్రపంచ నెట్వర్క్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనిషి లాగా ఆలోచించి పని చేయగలిగిన ఒక యంత్రం’. దీన్ని మొదట 1956వ సంవత్సరంలో జాయిన్ మెకార్తి అనే అమెరికన్ శాస్త్రవేత్త రూపొందించాడు. ఇటీవల అమెరికా, చైనా, జపాన్, ఇజ్రాయిల్ మొదలైన దేశాల్లో బాగా విస్తరిస్తోంది. ఈ రంగంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎక్స్ మొదలైన సంస్థలు అనేక పరిశోధనలు చేస్తూ.. లోపాలు సవరించుకుంటూ ...ఒకదానితో మరొకటి పోటీపడుతూ ముందంజలో దూసుకుపోతున్నాయి.

ఈ పరిజ్ఞానం అవసరం!

గ్లోబల్ ఏ.ఐ. నివేదిక 2023 ప్రకారం ప్రపంచ దేశాలలో కృత్రిమ మేధ సాంకేతికత నైపుణ్య అభివృద్ధిలో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా అమెరికా, జర్మనీలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2025 నాటికి మనదేశంలో కృత్రిమ మేధస్సు మార్కెట్ విలువ సుమారు 7.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కృత్రిమ మేధస్సును మన దేశంలో ఆరోగ్యం, వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ మీడియా, ఆటోమొబైల్స్, ఈ కామర్స్, బ్యాంకింగ్ భారీ పారిశ్రామిక రంగాల వంటి రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఇటీవల విద్యారంగంలో బోధన, అభ్యాసన రంగంలో ఏ.ఐ. సాంకేతికతను జోడించడం కీలకమైన పరిణామం. విద్యారంగంలో... విషయం (సబ్జెక్ట్), ఉపాధ్యాయుడు, విద్యార్థి - మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కనుక విద్యా రంగంలో (ఏ.ఐ.)కి తావు లేదు అని ఇటీవల కొందరు సంప్రదాయ వాదుల నుండి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ వాదనలో ఎంత మాత్రం హేతుబద్ధత లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో వేగంగా విస్తరిస్తున్న 'కృత్రిమ మేధ' అనే సాంకేతిక విజ్ఞాన విప్లవాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కాదు. పైగా.. వాంఛనీయం అంతకన్నా కాదు. దీని ద్వారా విద్యార్థికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి సాంకేతికతను అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నటువంటి నేటి తరానికి కృత్రిమ మేధస్సు ద్వారా అభ్యసించడం మరింత సులువవుతుంది. విద్యార్థికి ఈ పరిజ్ఞానం ద్వారా పర్సనల్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్, అడాప్టీవ్ లర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతాడు. విద్యార్ధులలో లెర్నింగ్ క్యూరియాసిటీని పెంచుతుంది. ఏ.ఐ ద్వారా నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తుంది.

తక్కువ సమయం.. ఎక్కువ ఫలితం

ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒకే సమయంలో అనేక మంది విద్యార్థుల ఆలోచన శైలిని, అభ్యసన రీతులను, ప్రతిభా విశేషాలను అంచనా వేయటానికి టీచర్‌కు తోడ్పడుతుంది. విద్యార్ధుల అభ్యాసనా ప్రక్రియలను గ్రాఫ్లులు, ఛార్టులు మల్టీ డైమెన్ష్‌లలో రూపొందించటానికి అధ్యాపకుడికి ఉపకరిస్తుంది. రియల్ టైం ఫీడ్‌బ్యాక్ పరిజ్ఞానం ద్వారా ఇది సాధ్యపడుతుంది. అంతేకాకుండా వివిధ రకాల విద్యా సంబంధ సమస్యలపై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధ్యాపకుడికి, స్కూల్ మేనేజ్మెంట్‌కు కూడా తోడ్పడుతుంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో అనేక విషయాలపై అవగాహన పెరుగుతుంది. పరిశోధన రంగంలో రీసర్చ్ స్కాలర్ కి బాగా ఉపయోగపడుతుంది. విషయ సేకరణ, సమస్యల విశ్లేషణకు దోహదం చేస్తుంది. పరిశోధన సమయం కలిసివస్తుంది. కృత్రిమ మేధస్సుతో కూడుకున్న కొన్ని సాంకేతికతలను ఇప్పటికే కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విరివిగా ఉపయోగించుకుంటున్నాయి.ముఖ్యంగా విద్యార్థుల అభ్యసన సమస్యలను, రీతులను (ట్రెండ్స్) మూల్యాంకనం చేయడం, గ్రేడింగ్ చేయడంలో, విద్యార్థుల ఫీడ్ బ్యాక్‌ను అంచనా వేయడం వంటి విషయాలను సులభతరం చేస్తుంది. విద్యార్థి అభ్యసనా తీరును గమనించి తన బోధనను మెరుగుపరచుకోవడానికి అధ్యాపకునికి ఈ పరిజ్ఞానం చాలా కీలకమైనది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పాఠశాల నిర్వహణలో అన్ని విభాగాలనూ ఆన్ లైన్ కార్యకలాపాల ద్వారా తక్కువ సమయంలో సమర్ధవంతంగా నిర్వహించుకోవచ్చు. తలిదండ్రులకు వేల మంది విద్యార్థుల పురోగతిని తెలియజేయడం. వివిధ విద్యా సంబంధిత నివేదికల రూపొందించడం వంటివి వేగంగా, ఖచ్చిత ఫలితాలతో రూపొందించవచ్చు. విద్యార్ధులలో అధ్యాపకులలో గల కవులు, కళాకారులు, చిత్రలేఖకులకు మొదలైన వారి క్రియేటివిటీకి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బాగా తోడ్పడుతుంది.

విద్యారంగంలో అద్భుత వనరు

‘బిగ్ డేటా’ లోతైన విశ్లేషణకు, గణిత సమస్య పరిష్కారానికి, గణాంకాల సంక్లిష్టతల పరిష్కారాలకు, అంతరిక్ష పరిశోధనలకు, రక్షణ రంగాలకు, వివిధ పరిశ్రమల్లో లోపరహిత నాణ్యమైన వస్తు ఉత్పత్తికి ఏ.ఐ.విరివిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యారంగంలో కీలకమైన బోధన, అభ్యాసన, మూల్యాంకన, పరిశోధనా రంగాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సాంకేతికత ప్రస్తుత తరానికి అనివార్యం. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు తమ సంస్థలలో బోధనలో అడ్మినిస్ట్రేషన్‌లో కృత్రిమ మేధస్సును విజయవంతంగా అమలు చేస్తున్నాయి. కరోనా తర్వాత భారత ప్రభుత్వం సైతం డిజిటల్ విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నది. అందులో భాగంగా స్వయంప్రభ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ సాంకేతిక ఆధారిత అభ్యసన, ఇతర డిజిటల్ బోధన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూజీసీ కూడా కృత్రిమ మేధస్సును ఉన్నత విద్యతో అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టింది. అన్ని రకాల గ్రంథాలయాల్లో అందించే అనేక అధునాతన సాంకేతిక సేవలను ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించటం ద్వారా వేగంగా అందించవచ్చు.

అయితే మనదేశంలో 140 కోట్ల జనాభాలో సుమారు 60-70 శాతం గ్రామీణ జనాభా ఉన్న మన దేశంలో ఈ కృత్రిమ మేధస్సు అమల్లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. సామాజిక ఆర్థిక అసమానతలు, లింగ వివక్షతలు గల సమాజంలో శిక్షణ పొందిన సాంకేతక విద్యార్హతలు గల ఉపాధ్యాయుల కొరత, పరిమిత ఆర్థిక వనరులు సమస్యలుగా ఉన్నాయి. క్రమంగా ఈ సమస్యలను మనం అధికమించి మన దేశం ప్రగతి పథంలో ముందడుగు వేయాల్సి ఉంది..

డా. కోలాహలం రామ్ కిషోర్

98493 28496



Next Story