నమ్మడమెందుకు, గొల్లుమనడమెందుకు?

by Disha edit |
నమ్మడమెందుకు, గొల్లుమనడమెందుకు?
X

తెలంగాణ పౌర సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న మేధావులు, సామాజిక వేత్తలు, కవులు, కళాకారులు, నాయకులకు ఓ సామాన్యుడి విజ్ఞప్తి...!

ఎన్నో ఏండ్లుగా రాజరికానికి, భూస్వాములు -పెత్తందార్ల ఆగడాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రజాస్వామికవాదుల ఉద్యమం, ఒక్కసారిగా దొరలు, పెత్తందార్ల వారసులైన కొంతమంది రాజకీయ నేతల చేతికి వెళ్ళింది. తెలంగాణ దొరల ఆగడాలకు, అణిచివేతకు, వివక్షకు పరిష్కారం దొరక్కుండానే - ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారి, ఆంధ్ర-తెలంగాణా ఆధిపత్య వర్గాల మధ్య అధికార బదలాయింపు కార్యక్రమంగా మారింది. ఇది గ్రహించలేని పౌర సమాజం, ఈ పెత్తందార్ల నాయకత్వంలోనే తెలంగాణ అస్తిత్వం పోరాటం పేరుతో, మా నీళ్లు, నిధులు, నియామకాలు మాక్కావాలని ప్రాణాలు ఫణంగా పెట్టి మలిదశ ఉద్యమం పేరుతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.

కారణాలేవైనా కావొచ్చు కానీ, తెలంగాణ ఉద్యమకారులంతా దొరల నాయకత్వాన్నే బలపరిచారు అప్పుడు, అధికారం అంతా ఒకే దొర కుటుంబంలో బందీ అయ్యిందని, మేమంతా మోసపోయామని గొల్లుమంటూ వీధిన పడ్డారు. ఇప్పుడు, మరో ఉద్యమం అంటూ మర్లపడ్డారు. కానీ ఏం లాభం, ప్రత్యామ్నాయ వేదిక లేకుండా మరో రాజకీయ పార్టీ వెంట పరుగులు పెట్టారు. మళ్ళీ మోసపోయామని ఘోష పెట్టే రోజు వస్తుందేమో అని, ఆవేదనతో ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ పౌర సమాజాన్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నాను.

అనైక్యతే మేధావుల బలహీనత

ప్రజలు ఏదైనా ఉద్యమంలో నిర్విరామంగా పోరాడిన తర్వాత, కొంతకాలం విరామం కోరుకోవడం సహజం, అదీ విజయం సాధించిన తర్వాత అయితే మరికొంతకాలం సంబురాల్లో ఉండటం, ఆశల పల్లకిలో విహరించడం అతి సహజం. తెలంగాణ సిద్దించాక, 5-సం.లు పునాది పేరుతో, మరో 5-సం.లు ఆశావాహ దృక్పథంతో వేచి చూసాం. ఆశలు అడియాసలై, కలల సౌధం కూలిపోయిందని తెలిసి, ప్రత్యామ్నాయం కానీ ప్రత్యామ్నాయాన్ని అందరూ నిలబెట్టారు, మరి ఈ ప్రత్యామ్నాయ వేదిక, తమ పార్టీ హామీలు దాటి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే రోజు వస్తుందేమో చూడాలి. అయితే, వ్యక్తిగత ఎజెండా వల్లనో, లేక వ్యక్తిగత గర్వం వల్లనో మేధావి వర్గం, మన పౌర సమాజం ఒక తాటి పైకి రాలేకపోతుందనేది ఒప్పుకోవాల్సిన నిజం.

తెలంగాణ పునర్నిర్మాణ లక్ష్యం ఏది?

ఒకానొక సందర్భంలో ప్రత్యామ్నాయంగా కనబడ్డవాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను, కళాకారులను, విద్యార్థులను, జర్నలిస్టులను, మేధావులను, తెలంగాణ ప్రజల్ని సమన్వయ పరిచి ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు ద్వారా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తారని అనుకున్నాను, కానీ పై వ్యక్తుల్లో ఎక్కువమంది తమ వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడానికి, తమకు జరిగిన అవమానాలకు సమాధానం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే, ఏ వేదిక అయితే ఆ కోరిక తీర్చగలదో ఆ పార్టీల్లో ఒదిగిపోయారు. కొందరు తమ లక్ష్యం సాధించారు, మరి కొందరు ఇంకా దారులు వెదుకుతూనే సాగుతున్నారు. వీళ్ళంతా గత ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పనిచేసారే తప్ప, తెలంగాణ పునర్నిర్మాణం లక్ష్యంగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన చాయలు చాలా తక్కువ...

అందుకే, కేసీఆర్ ప్రభుత్వం పోయిందని ఆనందిస్తున్నా, ఆ లక్ష్యం తమ ద్వారా జరగలేదనే ఆవేదనతో వాళ్ళ, వాళ్ళ వేదికలపై మళ్ళీ మళ్ళీ ప్రజల్ని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. ఇది రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పార్టీల ఆరాటం అంటే బాగుంటుందేమో కదా! అసలు పోరాటం చేసే ఆలోచన, చేయగలిగే లక్ష్యం నేటి నాయకత్వంలో ఉందా అనే సందేహం నాలాంటి సామాన్యులకు కలగడంలో ఆశ్చర్యం లేదు కదా!

పార్టీ రహిత ప్రత్యామ్నాయం అవశ్యం

గుడ్డికన్నా, మెల్ల నయం - ఎంతో కొంత కనబడుతుంది. అందుకే ప్రస్తుతం దొరల కన్నా, ఈ రాజకీయ నాయకులే నయం అనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా మన కొక ప్రత్యామ్నాయ వేదిక కావాలి. అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ నియంతృత్వ నాయకత్వంలో మాత్రం ఉండరాదు. అన్నీ నాకే తెలుసు అనే నాయకత్వం, అదే నియంతృత్వ పోకడలను కొనసాగిస్తుంది కానీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టలేదు. మనిషి మనోడే, కానీ బుద్దే దొరలది అన్నట్టుంటది. ఏ కారణం వల్లనైనా కావచ్చు, తెలంగాణలో చైతన్యం మెండుగా ఉంది. కానీ, స్వతంత్ర నాయకత్వ లోపంతో, ఏకతాటిపైకి రాని బహు నాయకత్వంతో నేడు తెలంగాణ సమాజం సతమతమవుతోంది.

సంస్కర్తలూ, నిబద్ధతా నేతలు ఎక్కడ?

ప్రజల పక్షాన నిరంతరం పోరాడే ఒక వేదిక, ఆ మాటకొస్తే అనేక వేదికలు అవసరం, ఈ వేదికల లక్ష్యం మాత్రం సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, సమతుల్య సమాజంగా ఉండాలి. రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా కాకుండా, స్వతంత్ర పోరాట వ్యవస్థలుగా ఉండటం చాలా అవసరం. ఇన్నేళ్ళ పోరాటాలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి దళారుల్ని, బానిస రాజకీయ నాయకుల్ని తయారు చేయగలిగాయే తప్ప, సంస్కర్తలను, పోరాట యోధులను, నిబద్దత గల నాయకుల్ని అందించలేక పోయాయి. పోరాటాల నాయకత్వం అంతా ఆధిపత్య వర్గాలదే కావడం ఒక ముఖ్య కారణం. కానీ ఈ స్థితిని దాటి గట్టి నాయకుల్ని, పాలకుల్ని దిగువ సమాజం నుంచి అందించే దిశగా వేగం పెంచాల్సిన సమయం ఇదే కదా.

నమ్మి బలైపోవడం ఎన్నాళ్లు?

గుడ్డిగా మద్దతివ్వడం, లేక వ్యతిరేకించడం రెండూ ప్రమాదకరమే. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నాయకులు, సామాజిక వేత్తలు , కవులు , కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు తర్కంతో ఆలోచించి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. త్యాగాలు పక్కింటి వాళ్ళు, చేయాలి, ఫలితం మాత్రం మా ఇంటికి రావాలనే ధోరణి వదిలి, అందరూ కలిసి పోరాటంలో బాగస్వాములై, మరో తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి. గుడ్డిగా నమ్మడం, బలైపోయాక బాధపడటం మానేయాలి. నాయకులంతా తర్కంతో ఆలోచించి, ప్రణాళికాబద్దంగా, సమాజ హితవు కోసం ఐక్యంగా పని చేయగలిగితే, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, సమతుల్య సమాజం కచ్చితంగా సాధించగలం.

- ప్రొఫెసర్ కె రామకృష్ణ

99128 07907



Next Story

Most Viewed