మళ్లీ రేసులోకి కాంగ్రెస్!

by Disha edit |
మళ్లీ రేసులోకి కాంగ్రెస్!
X

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో కొత్త జోష్ తెస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆదరణ లేదని పార్టీ వీడిన నేతలు తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారిన తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ రావటం, ప్రియాంక గాంధీ రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టిసారించడంతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ బీజేపీలో ఆశించిన విధంగా పరిస్థితులు కనిపించటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇతర పార్టీల ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరే అవకాశం లేదు. కాబట్టి పార్టీని వీడే ఆలోచన ఉన్న నేతలు ఆ దిశగా ప్రయత్నాలు విరమించారు. పార్టీని వీడిన వారు సొంతగూటికి చేరాలని మంతనాలు జరుపుతున్నారు.

దూకుడు పెంచిన రేవంత్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో టీపీ‌సీ‌సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్.. తాజాగా ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. యువతకు పలు హామీలు ఇచ్చారు. ఇదే క్రమంలో జూన్‌లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణకు వస్తారని తెలుస్తోంది. ఈ సారి ఓబీసీ డిక్లరేషన్, మైనారిటీ, మహిళా డిక్లరేషన్‌లు సైతం ప్రకటిస్తామని రేవంత్ అంటున్నారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో‌ను విడుదల చేస్తామని.. ఈలోపు తొమ్మిది డిక్లరేషన్‌లు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ హామీలు ఇస్తున్నామని స్పష్టతనిచ్చారు. మరోవైపు రేవంత్ మాత్రం కాంగ్రెస్, సహా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి రావాలని ఆయన బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు.

చేరికలపై గంపెడాశలతో..

కర్ణాటక ఫలితాలు కమలం పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ఇక సమీప భవిష్యత్‌లో ఉన్నది తెలంగాణ ఎన్నికలే. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే వరుస కార్యక్రమాలు, ర్యాలీలు, సభల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తున్న కమలం పార్టీ ఈ దూకుడు మరింత పెంచాలనే ఆలోచనలో ఉంది. కొంతకాలంగా తెలంగాణ బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. దీంతో మళ్ళీ బీజేపీ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చేరికల కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈటల అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఆయనను బుజ్జగించే పనిలో బీజేపీ అధిష్టానం ఉందని అందుకే ఆయన పలుమార్లు ఢిల్లీకి వెళ్ళివస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈటలకు రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారు ఆయనతో చాలామంది టచ్‌లో ఉన్నారు. దీంతో ఈటలకు ఏదైనా కీలక పదవి ఇస్తే.. పార్టీకి ప్లస్ అవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలు, బీఆర్ఎస్‌ను ఎదుర్కోనేందుకు అనుసరించాల్సిన మార్గం, మిషన్‌ 90 సాధనలో క్షేత్రస్దాయిలో పరిస్థితి, బీజేపీ అధిష్టానం అనుసరించవలసిన మార్గదర్శకాలను ఈటల ద్వారా తెలంగాణ బీజేపీ పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ధీమాతో బీఆర్ఎస్!

తెలంగాణ రాష్ట్రంపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఏ విధంగానూ ఉండదని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలలో కర్ణాటక ఫలితాలను బట్టి ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది అన్నది అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇక ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం అవుతుంది అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కర్ణాటక రిజల్ట్ ఆధారంగా తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, లేదా త్రిముఖ పోటీ జరగనుందా అన్నది తెలియనుంది.

కొత్త పొత్తులకు ఉత్ప్రేరకం!

కర్ణాటక కాంగ్రెస్ ఫలితాలు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాల మార్పు కొత్త పొత్తులకు ఉత్ప్రేరకమనే చెప్పవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ప్రాంతీయ పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత, లోకల్ నాయకత్వ లేమి, బీజేపీలో అంతర్గత కలహాలు, వికటించిన ప్రయోగాలు కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేసాయి. అధికారం కోసం భేషజాలు, వైవిధ్యాలు, వైషమ్యాలు మరచి కాంగ్రెస్ పార్టీని ఏకం చేసి విజయం చేకూర్చిన నాయకుల కృషి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ శ్రేణులకు పాఠం. దెబ్బతిన్న బెబ్బులిలా బీజేపీ కొత్త వ్యూహాలతో సిద్ధమౌతోంది. నవీన్ పట్నాయక్ 2024 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీయేతర ప్రతిపక్ష ఫ్రంట్‌లో చేరడానికి సుముఖంగాలేరు. 2024 ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని విరమించుకున్నారు. ఆమె కాంగ్రెస్‌తో కూడిన ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు సానుకూలం. ఇక ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకేతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)గా శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ మూడు పార్టీలు కలిసి పోరాడాలని భావిస్తున్నాం అన్న శరద్ పవార్ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ పరిణామక్రమం బీఆర్ఎస్‌‌ను అంతర్మధనంలోకి నెట్టింది. ప్రాంతీయంగా పార్టీ బలంగా ఉన్న ఇటీవల పరిణామాలు, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అసమ్మతి పార్టీని కలవరపెడుతున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన ప్రాబల్యాన్ని, ప్రభావాన్ని ఎలా చూపుతుందో వేచి చూడాలి.

-శ్రీధర్ వాడవల్లి

99898 55445



Next Story

Most Viewed