పార్లమెంట్ ప్రహసనం.. అదానీపై చర్చ ఏది?

by Disha edit |
పార్లమెంట్  ప్రహసనం.. అదానీపై చర్చ ఏది?
X

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ సభలు ప్రారంభమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడదు. మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. ప్రతిపక్షాలు ఎంత గందరగోళం రేకెత్తించినా తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. అంతేకాదు, ప్రతిపక్షాలు ఎంత తీవ్రమైన సమస్యను లేవనెత్తినా వారికి జవాబివ్వనవసరం లేదని ప్రభుత్వంలో ఉన్నవారు భావించే పరిస్థితి ఏర్పడింది. సభలో అన్నిటికంటే ముందుగా దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలన్నా, వారి నిరసనలన్నా ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. అసలు వారితో చర్చించడమే అనవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఏ విధంగానైనా తాము అధికారంలోకి రాగలమన్న ధీమా, సభ్యులను సస్పెండ్ చేసి అయినా బిల్లులను ఆమోదించుకోగలమన్న ధైర్యం ప్రభుత్వానికి ఏర్పడింది. తద్వారా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండాపోయింది. నేడు దేశంలో అసాధారణమైన రీతిలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల దిగుమతి వ్యయం తీవ్రంగా పెరిగింది. పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంటనూనెల ధరలే కాక, ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. వీటికీ సమాధానాలు ఇవ్వమని ప్రతిపక్షాలు కోరితే ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి అంశానికి ప్రభుత్వానికి జవాబు చెప్పే బాధ్యత ఉంటుంది. కానీ లెక్కలేనితనం ప్రభుత్వాన్ని ఆవరించింది. వరస విజయాలు సాధించినంత మాత్రాన, ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోయినంత మాత్రాన పార్లమెంట్ సమావేశాలతో పాటు, పార్లమెంటరీ సంప్రదాయాలను కూడా గంగలో కలుపుతారా?

గతంలో ప్రజాహితం, దేశాభివృద్ధి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయే తప్ప వాదప్రతివాదనలతో వ్యక్తిగత స్థాయిలో బురద జల్లుకోలేదు. కోట్లాది ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ జరగకపోవడం తీవ్రమైన విషయంగా పరిగణించాలి. 1952 నుండి 1970 మధ్యకాలంలో భారతదేశంలో లోక్‌సభ జరిగిన రోజులు 121 రోజుల నుంచి 140 రోజుల పాటు సమావేశం అయినట్లు లోక్ సభ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఏడాదికి సగటున 60 నుంచి 70 రోజులు కూడా పార్లమెంట్ సమావేశాలు జరగటం లేదు. గతంలో చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించడానికి ముందుగా నిర్ణయించుకున్న దానికన్నా ఎక్కువ సమయం వెచ్చించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక సదుపాయాలు పొందుతున్న ఎంపీలు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంది.

ప్రతిపక్షాన్ని లెక్కచేయరు

మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో జరిగే కార్యకలాపాల పైన ఎలాంటి గౌరవమూ లేదు. ప్రజాస్వామ్య సంస్థలను ప్రత్యేకించి పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చడం బాధ్యతా రాహిత్యం. పార్లమెంటులో చర్చల విషయమై చాలా మాట్లాడతారు. కానీ చర్చలు జరగకుండా అంతర్గతంగా వ్యూహం పన్నుతారు. పార్లమెంటుకు, చర్చలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. సభలు ప్రారంభం కావడానికి ముందు ఆయా పార్టీల నాయకులతో ప్రధాని సమావేశమై చాలా తక్కువసేపు మాట్లాడతారు. ఏ అంశాన్నైనా సభలో ప్రతిపక్షం లేవనెత్తడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని తగిన జవాబు చెబుతుందని ప్రధాని చెబుతారు. అయితే ఆచరణలో ఈ మాటలు పాటించరు, రైతుల సమస్యలు, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బలహీన వర్గాల వారిపై దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు తదితర సమస్యలను చర్చించేందుకు ప్రతిపక్షానికి అవకాశమే ఇవ్వరు. ప్రజా వ్యతిరేక బిల్లులను అడ్డుకొనేందుకు ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నించిందనేది వాస్తవం.

రైతుల, కార్మికుల, దళితుల, యువత ఆగ్రహాన్ని సభలో వ్యక్తం చేసేందుకు కూడా అనుమతించరు. ఓబీసీ రిజర్వేషన్‌ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాయి. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రాజకీయ పరిపక్వతను, సభా నిర్వహణ బాధ్యతను ఏమాత్రం ప్రదర్శించలేదు. ముఖ్యమైన బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షం చేసిన విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదు. పార్లమెంటు కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకే సెలక్ట్‌ కమిటీలకు బిల్లులను పంపుతారు. ఇలాంటి ప్రక్రియ బీజేపీ ప్రభుత్వానికి అసలు ఇష్టంలేదు. యూపీఎ ప్రభుత్వ కాలంలో 71 శాతం బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపగా బీజేపీ పాలనలో కేవలం 11శాతం బిల్లులే సెలక్ట్‌ కమిటీల పరిశీలనకు నోచుకున్నాయి. చర్చలు జరపటం పార్లమెంటు విధి, అయితే సభ అనేక సార్లు ప్రజల సమస్యలను విస్మరిస్తోంది.

సుద్దులు కేంద్రానికి వర్తించవా?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. ఎంతో అభివృద్ధిని సాధించాం. ఆర్థికంగా కూడా పురోగమించాం. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ వార్షిక బడ్జెట్‌ 250 కోట్లు దాటలేదు. ఇప్పుడు దేశ వార్షిక బడ్జెట్‌ దాదాపు రూ 45 లక్షల కోట్లకు చేరింది. ఆనాటి వార్షిక ఆదాయం 170 కోట్ల వరకు మాత్రమే ఉన్నప్పటికీ నాటి పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను, సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా మౌలిక సదుపాయాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగినప్పటికీ దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. దేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలే పేదరికం పేరిట ఉచిత పథకాలకు శ్రీకారం చుట్టారు. నేడు గతాన్ని తిరిగి పరిశీలిస్తే రెండు శతాబ్దాల బ్రిటిష్‌ పాలనలో జరగనంతగా ఈ 75 ఏళ్లలో విలువల విధ్వంసం జరిగాయి. ప్రజాస్వామ్యం- అప్రజాస్వామికంగా, అనైతికతే నైతికతగా చలామణి అవుతున్నాయి. అధికారమే పరమావధిగా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అధికారం కోసం సమాజాన్ని కులాలు, మతాల పేరిట ముక్కలు చెక్కలు చేస్తున్నారు.

మీ అప్పుల మాటేంటి మోడీజీ?

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అప్పులు 2023-24 ఆర్థిక బడ్జెట్‌లో పేర్కొన్నవిధంగా దాదాపు 170 లక్షల కోట్లకు చేరనున్నాయి. కడుతున్న వడ్డీలు రు. 10లక్షల 79వేల కోట్లకు చేరనున్నాయి. 1947 నుంచి 2014 వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు 56 లక్షల కోట్లు కాగా, తన ఎనిమిదేండ్లలో మోదీ చేసిన అప్పు 114 లక్షల కోట్లకు చేరింది. దీనికి ప్రభుత్వ ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బులు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికిపోతుంది అంటే సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలను పరిశీలిస్తే 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రూ.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి భారత దేశ అప్పు రూ.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరనుందని కేంద్ర బడ్జెట్‌ లో వివరించారు. మరి ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి మితిమీరిన అప్పులు ప్రమాదం అని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్న ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం మితిమీరి చేస్తున్న అప్పులకు ఏమి సమాధానం చెబుతారు?

కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌‌లో సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి అంగీకరించదు. గత తొమ్మిదేళ్లుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏ విషయం లోను ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అమెరికాలోని హిడెన్ బర్గ్ పరిశోధనా సంస్థ కార్పొరేట్‌ దిగ్గజం గౌతం అదానీ గ్రూపు పాల్పడిన అక్రమాలు, అవకతవకలు, మోసాలు వెల్లడించడం చూసి ప్రపంచమే కంగుతిన్నది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుల్లో రెండవ పెద్ద సంపన్నుడిగా అమెరికా పత్రిక పోర్బ్స్‌కూడా గత ఏడాది ప్రకటించింది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థల వద్ద వేలాదికోట్ల రూపాయల రుణాలు తీసుకొని స్టాక్‌మార్కెట్‌లో పెట్టడం, దొంగ కంపెనీలను సృష్టించడం, లెక్కల్లో మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. అమెరికా ఆర్థిక దర్యాప్తు సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక కూడా అదాని బండారం బట్టబయలుచేసింది. అదానీ గ్రూపు అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చించడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేస్తుంది. ఇంతటి తీవ్రమైన భారీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చించే సమయంలేదు

అదానీకి ఒక న్యాయం...

అదానీ గ్రూప్ అవకతవకలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంలో తప్పులేదు. అదానీ వ్యవహారంపై చర్చించాలన్న ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అదానీ గ్రూప్ వ్యవహారాన్ని చర్చించాలని పట్టుపట్టడంలో దాదాపు ప్రతిపక్షాలన్నీ ఒకే వైఖరి అనుసరిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చెయ్యడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ జె.పి.సి ఏర్పాటు చెయ్యాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. జె.పి.సి ఏర్పాటు చెయ్యడం కొత్త కాదు. అందులో ప్రతిపక్షాలకన్నా అధికారపక్ష సభ్యులే ఎక్కువగా వుంటారు. మన పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఆరుసార్లు జె.పి.సి ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తులో అనేక అంశాలు చర్చకు వస్తాయి. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుస్తాయి. జెపిసి అంటే ఎందుకు అంత భయం అదానీ-మోడీ అనుబంధ లీలలు ప్రజలకు తెలుస్తాయని భయమా అందుకే ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో అదానీ గ్రూప్ అవక తవకలపై, కుంభకోణంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. ఈ అంశం దేశం మొత్తాన్నికలిచి వేస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పకపోవడం బాధ్యతా రాహిత్యం. అదానీ కుంభకోణంలో ప్రజాధనం దోపిడీకి గురైంది కాబట్టి ఈ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. అదాని లాంటి బడా సంస్థలు అక్రమాలకు పాల్పడి ప్రజలను కోలుకోని విధంగా నష్టపరచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు మాత్రమే మోదీ ప్రభుత్వం తీసుకొన్నది. ఈ పరిణామాలు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయి. అదానీ గ్రూప్ కుంభకోణంపై ప్రపంచం అంతా గగ్గోలు పెడుతున్నప్పటికీ మోడీ నోరు మెదపడం లేదు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులు ప్రధాని మోదీ లోక్‌సభలో ఎదురుదాడికి దిగడం దురదృష్ట కరం.

నీరుకొండ ప్రసాద్

9849625610

Next Story

Most Viewed