వందేళ్లు బతకడం కలేనా!?

by Ravi |
వందేళ్లు బతకడం కలేనా!?
X

భవిష్యత్తు మానవ మనుగడకు ప్రమాదకారులుగా వాతావరణ మార్పు, పాండమిక్స్( మహమ్మారులు) ప్రముఖ పాత్ర వహించనున్నాయి. గత శతాబ్ద కాలంలో రవాణా సౌకర్యాలు పెరగడంతో మానవుల సంచారం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో రకరకాల కాలుష్యాలు ప్రపంచాన్ని చుట్టుముట్టిన పరిస్థితి. ప్లాస్టిక్ వినియోగం, ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం, రకరకాల యూజ్ అండ్ త్రో వస్తువులతో పర్యావరణ కాలుష్యం అధికం అవుతుంది.‌ ఎక్కడ చూసినా వ్యర్థాలు అనకొండ లాగా విస్తరించి ఉన్నాయి. తరచూ వివిధ దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు, సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలు, కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో అంతర్గత హింసతో చెలరేగుతున్న హింస, బాంబుల వర్షం వంటివి మొత్తం పర్యావరణ అసమతౌల్యానికి కారణం అవుతూ మనుషులకు ఆ మాటకు వస్తే సమస్త జీవుల మనుగడకు ప్రమాదం పొంచి ఉంది.‌

ఆధునీకరణ కొత్తపుంతలు

జనాభా పెరుగుదల వలన, వారి ఆవాసాలు, అవసరాల కోసం అటవీ ప్రాంతం తగ్గిపోతోంది. చెట్లు, మొక్కలు నరకడంతో డి ఫారెస్టేషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో వాతావరణ మార్పు పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో జరుగుతున్నది. అకాల వర్షాలు, వడగళ్ళు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ మనుషుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అదే సమయంలో అడవుల్లో నివసించే పులులు, చిరుతలు, ఏనుగులు కోతులు వంటివి జనావాసాల్లోకి వస్తూ భయభ్రాంతులను కలుగజేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆధునీకరణ పేరుతో మానవ జీవన విధానం పలు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్,ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్, ప్యాకింగ్ ఫుడ్ భుజిస్తూ రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఊబకాయం పెరుగుతోంది. యన్.సి.డి వ్యాధులకు గురవుతున్నారు.‌ ఇటీవల కాలంలో గుండె పోటుతో అనేకులు మరణిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ దాదాపు ఏదో ఒక రోగంతో చిన్న పిల్లలు నుంచి పెద్దల వరకూ బాధపడుతున్నారు.

నిండు నూరేళ్లు కల్లో మాటే..

రకరకాల మహమ్మారులు ప్రపంచ వ్యాప్తంగా తిష్ట వేసి ఉన్నాయి. 2019లో బయటపడి, అనేక లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ నేడు ఇంకా రకరకాల రూపాల్లో ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నది. దీనికి తోడు రకరకాల అలెర్జీ వ్యాధులు, నీటి సంబంధమైన రోగాలు, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు మనుషులను పట్టిపీడిస్తున్నాయి.‌ మహిళల్లో అనేక రుగ్మతలు పౌష్టికాహారలోపం, రక్తహీనత, పలురకాల క్యాన్సర్లు వెంటాడుతున్నాయి. ఇక ఆరోగ్య సంరక్షణ కోసం వాడే వివిధ డిస్పోజబుల్ వస్తువులు ( మాస్కులు, గ్లౌవ్స్, కాటన్, సిరంజీలు వంటివి) భూభాగాన్ని ఆక్రమించి, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.‌ శిలాజ ఇంధనాలు వాడకం, ఫ్రిజ్, మోటార్ వాహనాల వలన అపరిమితంగా గాలి కాలుష్యం పెరిగిపోతోంది. పంట వ్యర్ధాలను తరచూ కాల్చడం వల్ల మరింతగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.‌ అడవులు తగలబడుతూ వేడి ప్రబలుతున్నది.‌ ఇటువంటి అంశాలన్నింటి ఫలితంగా భవిష్యత్తులో ఈ భూమి మీద మానవుడిని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకనిచ్చే పరిస్థితి కనపడుటలేదు.‌ ఇంక మానవుడు భుజించే ఆహార పదార్థాలన్నీ దాదాపు కెమికల్స్‌తో తయారుచేసినవే..

భయపెడుతున్న కాంక్రీట్ జంగిల్

ఇటువంటి పరిస్థితుల్లో మానవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే అడవులను కాపాడుకోవాలి. కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలి. కల్తీలకు దూరంగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలి.‌ సైకిల్ వాడకం పెంచాలి. శిలాజ ఇంధనాలు వాడకం తగ్గించాలి.‌ చెట్లు పెంచాలి. కాంక్రీట్ జంగిల్ నుంచి బయటపడాలి. భూగర్భ జలాలు పెంచడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. పరిశుభ్రత పాటించాలి. ప్రభుత్వాలు అటవీ చట్టాలను, పర్యావరణ పరిరక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి.‌ పౌర సమాజమా! మనం కూడా మనకోసం, భావితరాల కోసం, పర్యావరణ పరిరక్షణకు మనవంతు కృషి చేయడం ద్వారానే ఈ భూగోళంపై మరికొన్ని సంవత్సరాలు జీవరాశి మనుగడ సురక్షితంగా ఉంటుంది అని గ్రహించి ముందుకు సాగటమే మన కర్తవ్యం.

ఐ. ప్రసాదరావు

99482 72919



Next Story

Most Viewed