మరోసారి ఢిల్లీకి ‘ఈటల’.. అమిత్ షాతో భేటీ.?

by  |
Eatala Rajender Bjp
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వం తీసుకోనున్నారు. ఆయనతోపాటు కరీంనగర్ జిల్లా మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గండ్ర నళిని, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి, షాద్‌నగర్‌కు చెందిన బాబయ్య, మాజీ ఎమ్మెల్సీ సత్యానారాయణ తదితరులు కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. వీరి చేరిక సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా హాజరుకానున్నారు. ఈటల రాజేందర్‌తో శామీర్‌పేట్‌లో శనివారం మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి భేటీ కావడం కూడా కొన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

జేపీ నడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం బీజేపీలో చేరిన తర్వాత సాయంత్రానికి అమిత్ షాను ఆయన నివాసంలో వీరంతా కలవనున్నట్లు ప్రాథమిక సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే హుజురాబాద్‌లో సైతం సత్తా చాటుకోవాలనుకుంటున్నది. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జితో సమావేశాలు జరిగినప్పటికీ జేపీ నడ్డా, అమిత్ షా మార్గదర్శకత్వంలో పక్కా వ్యూహం తయారుకానున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు పేర్కొన్నారు.



Next Story

Most Viewed