చైనా కిట్‌లలో నాణ్యత ఎంత? రక్షణ ఇవ్వగలవా?

by  |
చైనా కిట్‌లలో నాణ్యత ఎంత? రక్షణ ఇవ్వగలవా?
X

న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో దాని కట్టడికి అవసరమవుతున్న వైద్యపరమైన పరికరాలు, రక్షణ పరికరాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసే డాక్టర్లు, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది కోసం పర్సన్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్ల కోసం అనేక దేశాలు వేట ప్రారంభించాయి. ఈ పీపీఈ కిట్ల కొరత ఏర్పడటంతో పలు దేశాలు పెద్ద ఎత్తున్న విదేశాల నుంచి తెప్పించుకుంటున్నాయి. ప్రపంచంలో వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దేశం చైనానే. దీంతో అత్యధిక దేశాలు చైనా నుంచే వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా నుంచే వైరస్ ప్రబలిందని పలు దేశాలు విమర్శలు చేస్తుండగా.. ఇప్పుడు చైనా తయారు చేస్తున్న పీపీఈ కిట్లలో నాణ్యత కూడా సరిగా ఉండట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ పెరిగిపోవడంతో దానికి సరిపడా కిట్లు తయారు చేయడానికి నాణ్యతకు చైనా కంపెనీలు తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఇటలలీ, స్పెయిన్ దేశాలకు వచ్చిన వైద్య పరికరాలు, మాస్కుల నాణ్యతపై అవి చైనాకు ఫిర్యాదు చేశాయి. తాజాగా భారత్‌కు చేరుకున్న సామాగ్రిలో 30 శాతం కిట్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది.

కరోనా కట్టడి కోసం ప్రభుత్వానికి పలు ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందజేస్తున్నాయి. ఒక ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి పీపీఈ కిట్లను విరాళంగా అందజేసింది. ఇవన్నీ చైనా నుంచి తెప్పించినవే. 1 లక్షా 70 వేల వ్యక్తిగత సంరక్షణ పరికరాలు భారత్‌కు రాగా.. వాటిని గ్వాలియర్‌లోని డీఆర్డీవో ల్యాబరేటరీలో పరీక్షించారు. దాదాపు 50 వేల కిట్లు నాణ్యత లేనివిగా గుర్తించారు. ఇండియాకు దిగుమతి అయ్యే పరికరాలపై తప్పనిసరిగా ఎఫ్‌డీఏ/సీఈ ప్రమాణాలున్న మార్క్ తప్పని సరిగా ఉండాలి. ఒక వేళ ఎవరైనా ఇలాంటి మార్కులేని పరికరాలను దిగుమతి చేసుకుంటే.. మన దగ్గర ఉండే పరిశోధనా కేంద్రాల్లో పరీక్షలు చేయించాలి. ఇటీవల చైనా నుంచి దిగుమతి అయిన పరికరాలకు ఎలాంటి మార్క్స్ లేకపోవడంతో పరీక్షలు నిర్వహించగా.. వాటిలోని డొల్లతనం బయటపడింది. వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి నాసిరకం పీపీఈలు వాడితే వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యాలకు ముప్పే అని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి సరైన రక్షణ ఇవ్వలేవని.. చైనా పీపీఈలను వాడకపోవడమే మంచిదని అంటున్నారు.

చైనాలో తప్ప వేరే ఇతర దేశాల్లో వైద్య పరికరాలు భారీ ఎత్తున తయారు కావడం లేదు. దీంతో తప్పనిసరిగా చైనా నుంచే ఈ పీపీఈ కిట్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కాగా, ప్రభుత్వం కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు చైనా నుంచిగానీ మరే ఇతర దేశం నుంచి కానీ వైద్య పరికరాలు, మాస్కులు దిగుమతి చేసుకోవాలంటే నాణ్యతా ప్రమాణాల ప్రకారం, గుర్తింపు ఉన్న ప్రముఖ కంపెనీల నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాణ్యత లేని వాటిని వాడి వైద్యులు, సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టవద్దని.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించింది.

tags: coronavirus, world, ppe, protection, equipment

Next Story

Most Viewed