ఆస్పత్రులన్నింటికీ డబుల్ విద్యుత్ లైన్

by  |
ఆస్పత్రులన్నింటికీ డబుల్ విద్యుత్ లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని హాస్పిటళ్లకు డబుల్ విద్యుత్ లైన్ వేసినట్లు ట్రాన్స్ కో, జెన్‌ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆస్పత్రులన్నింటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో కొవిడ్ చికిత్స అందిస్తున్న గాంధీ, టిమ్స్, చెస్ట్, కోటి ఈఎన్టీ, నిమ్స్, ఫీవర్ ఆస్ప్రత్రుల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడకుండా 24 గంటలు విద్యుత్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కొవిడ్ విపత్కర సమయంలోనూ సంస్థలో అందరూ కలిసికట్టుగా కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ పేషెంట్ల కోసం అందుబాటులో రెండు ఆక్సీజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిద్వారా 130 టన్నుల ఆక్సీజన్ ఉత్పత్తి జరుగుతోదన్నారు.

30 రీఫిల్లింగ్ ఆక్సీజన్ స్టేషన్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బందికి కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు. సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ అందించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా విద్యుత్ డిమాండ్ తగ్గిందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జనరేషన్, సరఫరా చేస్తామని ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సడలింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు కలెక్షన్ కేంద్రాల్లో చెల్లించాలని ఆయన కోరారు. మంగళవారం యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో నోడల్ ఆఫీసర్లు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. విద్యుత్ ఆటంకం కలిగితే యాజమాన్యాలు నోడల్ అధికారిక తెలియజేయాలని ఆయన సూచించారు. 113 ప్రభుత్వ దవాఖానల్లో, 1,050 ప్రైవేట్ హాస్పిటళ్లలో కొవిడ్ చికిత్స అందిస్తున్నారని, ఆ దవాఖనలకు అదనపు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ తమ కలెక్షన్ కేంద్రాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని, వినియోగదారులు బిల్లులు సకాలం లో చెల్లించాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed