సస్పెండ్ చేస్తారా..? చేయరా..?

by  |
సస్పెండ్ చేస్తారా..? చేయరా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అధిష్టానం ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగనుందా, లేక ఆయనపై వేటు వేస్తారా అన్నదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాశారు. అయితే ఈటలపై సస్సెన్షన్ వేటు వేస్తారా లేక గతంలో హోల్డ్‌లో పెట్టినట్టుగానే పెడతారా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.

డీఎస్ విషయంలో…

రాజ్యసభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సీఎం కేసీఆర్ తనయ కవిత నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశం అభిప్రాయపడింది. జిల్లా ఇంఛార్జీగా వ్యవహరిస్తున్న తుల ఉమ కూడా హాజరయిన ఈ సమావేశంలో డీఎస్‌ను పార్టీ నుండి తొలగించాలని నిర్ణయించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. అయితే ఇప్పటి వరకు డి.శ్రీనివాస్ పై చర్య తీసుకోకుండా సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని పెండింగ్‌లోనే ఉంచారు. బీసీ నేత కావడం వల్లే డీఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఈటల విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ పార్టీలో సాగుతోంది. బీసీ నేత అయిన ఈటల రాజేందర్ ఉద్యమ ప్రస్థానంలో కూడా కేసీఆర్ వెన్నంటి నడిచారు.

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో సంబంధాలు ఉండడం కూడా ఆయనకు లాభిస్తుందని సీఎం అనుకుంటారా లేక కఠినంగా వ్యవహరిస్తారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈటల సతీమణి జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడ పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. అటు బీసీల్లో ఇటు రెడ్డి సామాజిక వర్గంలో కూడా పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న విషయంపై ఆచూతూచి అడుగేసే అవకాశాలు ఉంటాయంటున్న వారూ లేక పోలేదు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత కూడా ఉండడం వల్ల కూడా పార్టీకి ఆ సామాజిక వర్గం మరింత దూరం అయితే ఎలా దీనిని అధిగమించడం అన్న విషయంపై కూడా అధిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం.



Next Story

Most Viewed