ప్రారంభమైన దేశీయ విమానాల రాకపోకలు

by  |
ప్రారంభమైన దేశీయ విమానాల రాకపోకలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలుత అనుకున్నట్లుగా 30విమానాలకు బదులుగా 38 విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి మరికొన్ని విమానాలు తోడవుతున్నాయి. క్రమంగా సాధారణ పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సైతం కేంద్రం ఆలోచిస్తుండడంతో శంషాబాద్‌లోని పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం పరిశీలించారు. విమానాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణీకుల కరోనా లక్షణాలపై ప్రభుత్వ పర్యవేక్షణ థర్మల్ స్క్రీనింగ్‌కు మాత్రమే పరిమితమైంది. కేంద్ర మార్గదర్శకాల్లో క్వారంటైన్ నిబంధన లేకపోవడంతో ప్రయాణీకుల స్వీయ నియంత్రణ, స్వీయ బాధ్యతపైనే ప్రభుత్వం భారం వేసింది.

దాదాపు రెండు నెలల నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తిరుపతి నుంచి మూడు విమానాలు రావడంతో పాటు మొత్తం 19 విమానాలు హైదరాబాద్‌కు వస్తున్నాయని, ఇంతే సంఖ్యలో ఇవి తిరిగి ఇతర గమ్యస్థానాలకు వెళ్తున్నాయని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. విమానాశ్రయంలోని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్ళను ఆయన స్వయంగా పరిశీలించి జీఎంఆర్ నిర్వాహకులు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతుందని, థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని మాత్రమే క్వారంటైన్‌కు పంపిస్తామని, అవి లేనివారు యధావిధిగా అన్ని పనులూ మామూలుగానే చేసుకోవచ్చని మీడియాకు వివరించారు.

తొలి రోజున సుమారు 1600 మంది ప్రయాణీకులు వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కి వస్తున్నారని సీఎస్ తెలిపారు. ముందుగా రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులు రాకపోయినా, విమాన సర్వీసు నడవడానికి అవసరమైనంత సంఖ్యలో లేకపోయినా ఆ ఫ్లయిట్స్ క్యాన్సల్ అవుతున్నాయని, మొదటి రోజున ఇలాంటి కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ సూచించే సూచనలు, సలహాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రయాణికులందరూ పాటించాలని సూచించారు.

Next Story

Most Viewed