అనర్హులకు ‘డబుల్’ ఇళ్లిచ్చారని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలు

by  |
అనర్హులకు ‘డబుల్’ ఇళ్లిచ్చారని.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలు
X

దిశ, పాలేరు : డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ తిరుమలాయపాలెం మండలం కొక్కెరేణి గ్రామానికి చెందిన మహిళలు శనివారం తిరుమలాయపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామానికి చేరుకుని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి మంజూరై పూర్తైన 18 డబుల్ బెడ్రూం ఇళ్లు అర్హులకు ఇవ్వకుండా.. ఇదివరకే ఇళ్లు, పొలాలు(అనర్హులకు) ఉన్న వారినే ఎంపిక చేశారని, దీనిపై విచారణ చేపట్టాలని భీష్మించుకుని కూర్చున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉదయం తహశీల్దార్ రవికుమార్‌కు వివరించారు. వెంటనే విచారణ చేపట్టి అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరాగా, అప్పటికే లాటరీ అయిపోయి లబ్ధిదారుల ఎంపిక జరిగిందని మళ్ళీ మరో ఇరవై వస్తాయి అప్పుడు ఇస్తాం.. అప్పటివరకు ఆగాలని ఎమ్మార్వో సమాధానమిచ్చారు.

దీంతో వారు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి అర్హులకు ఇళ్లు ఇవ్వాలని అప్పటివరకు ట్యాంక్ దిగేది లేదని తెగేసి చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొక్కెరేణి చేరుకుని వాటర్ ట్యాంక్ ఎక్కిన నలుగురు మహిళలను కిందకు దించే ప్రయత్నం చేశారు. కానీ తహశీల్దార్ వచ్చి తమకు న్యాయం చేస్తేనే దిగుతామని ట్యాంక్ పై మహిళలు భీష్మించుకుని నిరసన తెలిపారు. లేదంటే పై నుంచి దూకుతామని హెచ్చరించారు. తమ గ్రామానికి మంజూరైన 18 ఇళ్లకు గాను మొదట 27 మంది అర్హులైన వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ 27 మంది కాకుండా మరో 10 మంది అనర్హులని మండల అధికారులు, నాయకులు లిస్టులో చేర్చి లాటరీ వేశారన్నారు.

ఈ డబుల్ బెడ్రూంలు కూడా పొలాలు, ఇళ్ళు ఉన్న వారికే రావడంతో వాస్తవంగా అర్హులైన పేదవారికి రాకపోవడంతో ఈ ఆందోళన చేస్తున్నామని ట్యాంక్ ఎక్కిన తీగల నాగమణి, చింతల నాగమణి, ధర్మపురి నాగమణి చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపిక చేసిన జాబితాలో రాజకీయ నాయకుల ప్రమేయముండటంతో ప్రజల మధ్య విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. సమగ్రంగా సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed