మాజీ మంత్రి బలరాంనాయక్‌ సహా నలుగురిపై అనర్హత వేటు

by  |
Balaram Nayak
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. మరో నలుగురిపైనా ఇదే రకమైన చర్యలు తీసుకున్నది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, 2021 జూన్ 22 నుంచి రానున్న మూడేళ్ల కాలం వరకు ఈ ఐదుగురు లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి తదితర ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పేర్కొన్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా గెజిట్ విడుదల చేశారు.

ఈ ఐదుగురిలో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మహబూబాబాద్ (ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, ఒక స్వతంత్ర అభ్యర్థి (రొయ్యల శ్రీనివాసులు), శివసేన పార్టీకి చెందిన మాధవరెడ్డిగారి హన్మంతరెడ్డి, బహుజన్ ముక్తి పార్టీకి చెందిన కాట్రావత్ వెంకటేష్ ఉన్నారు.

వీరంతా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి నిబంధన ప్రకారం 30 రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉన్నదని, కానీ నోటీసులు అందుకున్న తర్వాత కూడా సంజాయిషీ ఇవ్వలేదని, ఖర్చుల వివరాలను అందజేయలేదని, అందువల్లనే వారిపై మూడేళ్ళ పాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆ గెజిట్‌లో పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాం నాయక్ జూన్ 23 కల్లా ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉన్నదని, కానీ జూలై 6వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి సంజాయిషీ నోటీసు ఇచ్చినా స్పందించలేదని, గతేడాది డిసెంబరు 16న నోటీసు జారీ చేసినా స్పందన లేదని ఉదహరించారు. వివరణ ఇవ్వకపోవడంతో పాటు ఖర్చు వివరాలను సమర్పించనందున ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్-10-ఏ ప్రకారం మూడేళ్ళ పాటు పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.

కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్‌పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన, నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను కేంద్ర ఎన్నికలసంఘానికి సమర్పించకపోవడంతో ఈసీ అనర్హత వేటు వేసింది. మూడేళ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీచేసే అర్హతను బలరాం నాయక్ కోల్పోయినట్లు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు సహా మెదక్ నుంచి పోటీ చేసిన హన్మంతరెడ్డి, నల్లగొండ నుంచి పోటీ చేసిన కాట్రావత్ వెంకటేశ్, రొయ్యల శ్రీనివాస్ తదితరుల మీద కూడా ఇదే తరహా ఆంక్షలు విధించింది.



Next Story

Most Viewed