ముంపు నివారణకు జోన్ల వారీగా ప్రణాళికలు: అర్వింద్‌కుమార్

by  |
ముంపు నివారణకు జోన్ల వారీగా ప్రణాళికలు: అర్వింద్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓఆర్ఆర్ పరిధి ప్రాంతాల్లో ముంపు నివారణ కోసం జోన్ల వారీగా కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సూచించారు. ముంపు నివారణ చర్యలపై సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ మాట్లాడుతూ రానున్నవర్షాకాలంలోపు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతాలను తిరిగి ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 1908 అనంతరం నగరంలో 2020 అక్టోబర్ 17న ఆరు గంటల వ్యవధిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నగరంలోని అనేక అపార్ట్ మెంట్లలోని సెల్లార్లలో నీరు చేరడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సెల్లార్ల నుంచి నీరు ఎత్తిపోయడానికి వీలుగా విధిగా మోటార్ పంపులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జూన్ కంటే ముందుగానే జోన్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185చెరువులు, కుంటలకు తూములు, మత్తడిల పునర్నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

Next Story

Most Viewed