మురిపించి మూడు నెలల్లోనే ముగించేశారు.. మరి వారి గతేంటి..?

by  |
మురిపించి మూడు నెలల్లోనే ముగించేశారు.. మరి వారి గతేంటి..?
X

దిశ,గోదావరిఖని: కరోనా పుణ్యాన ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం పూటగడవని దుస్థితిలోకి నెట్టబడుతున్నారు. కష్టాల కడలిలో ఉపాధ్యాయులు అధ్యాపకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇచ్చే అరకోరా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పులు కూడా పుట్టకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవంతో ఎంతోమంది సిబ్బందిని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విధుల్లో నుండి తొలగించాయి. దీంతో కరోనా వల్ల ప్రైవేట్ టీచర్ల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. నేటికీ పూట గడవక కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతూనే ఉన్నారు.

సెకండ్ వేవ్ లో కేసులు పెరిగిన నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తమ కష్టాలు కొనసాగుతున్న తరుణంలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ఎంతోమంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. దీనిపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట కార్యక్రమాలు నిర్వహించడంతో స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ టీచర్లకు ఆపత్కాల భృతిని ప్రకటించారు. ఇందులో ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయులకు నెలకు 2వేల రూపాయలతో పాటు 15 కిలోల బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మూడు నెలలపాటు ప్రైవేట్ టీచర్లకు రెండు వేల రూపాయలతో పాటు 15 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత నుండి మళ్లీ ఆపత్కాల భృతి నీరుగారిపోయింది. దీనితో ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయం అందకపోవడంతో సమస్యల సుడిగుండంలో ప్రైవేట్ టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

కరోనా రక్కసికి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు కూడా ఎంతో మంది బలయ్యారు. గతంలో లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వడం మానేశాయి. అసలే అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్న వారికి అర్ధాంతరంగా జీతాలు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. గతంలో పలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు అనేకమంది ఉపాధ్యాయులు అధ్యాపకులను విధుల్లో నుండి ఆకస్మికంగా తొలగించడంతో నేటికీ వారి పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అన్ని విద్యా సంస్థలు అప్పట్లో 90 శాతం బోధనేతర సిబ్బందిని 60 శాతనికి పైగా బోధన సిబ్బందిని పక్కన పెట్టారు.

హుజురాబాద్ కు ఉన్న నిధులు ప్రభుత్వ పథకాలుకు ఎందుకు లేవు..?

హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ప్రభుత్వం భర్తరఫ్ చేసినప్పటి నుండి నేటి వరకు ఆయా గ్రామాల అభివృద్ధితో పాటు హుజురాబాద్ కు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. వివిధ కొత్త కొత్త పథకాలను అమలు చేస్తుంది. హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా పథకాల అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేట్ టీచర్ల ఆర్థిక సహాయం కోసం ఆపత్కాల భృతిని ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నెలల్లోనే నీరుగార్చింది. ప్రభుత్వ సహాయం అందక ఎంతో మంది ప్రైవేటు ఉపాధ్యాయులు నాన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో మళ్లీ ప్రైవేటు ఉపాధ్యాయులు కలిసిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాల పైన ప్రభుత్వం శ్రద్ధ చూపి ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

బడులు తెరిచేవరకు ప్రైవేట్‌ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆపత్కాల సాయం అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని మూడు నెలలే అమలు చేసింది. గత ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు వరుసగా మూడు నెలలపాటు రూ.2 వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యం అందజేసింది. భౌతికంగా పాఠశాలలు తీయనందున జులై నెలకు కూడా సాయం అందుతుందని సిబ్బంది ఎదురుచూస్తున్నారు. పాఠశాలకు మూసేసరికి చదువులు చెప్పిన ఉపాధ్యాయులు కూలీలు గా మారుతున్నారు, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉపాధ్యాయులకు అపత్కాల భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.

-మద్దెల దినేష్, సీపీఐ నగర సహాయ కార్యదర్శి

Next Story

Most Viewed