జార్ఖండ్‌లో అరణ్య వాసం !

by  |
జార్ఖండ్‌లో అరణ్య వాసం !
X

దిశ, ఆదిలాబాద్: పొట్టకూటి కోసం జార్ఖండ్ రాష్ట్రం వెళ్లిన నిర్మల్ జిల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ వీధి వ్యాపారం చేసుకునే వారికి కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో చేపట్టిన లాక్‌డౌన్ మరింత దిక్కుతోచని పరిస్థితికి తేవడంతో అక్కడ అవస్థలు పడుతున్నారు. ఎలాగైన తమను సొంత గ్రామానికి తీసుకువచ్చి రక్షించాలని బంధువులకు ఫోన్ చేసి విలపిస్తున్నారు.

ఊరి బయట జీవనం !

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన పలు సంచారజాతి కుటుంబాలు జీవనోపాధి కోసం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘడ్ జిల్లాకు వెళ్లారు. అక్కడి మధ్నాపూర్ గ్రామంలో ఇల్లిల్లు తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో కరోనా ప్రభావం తమను ఇబ్బందులపాలు చేసిందని గోసంపల్లె వాసులు గంధం గంగన్న, శ్రీనివాస్, బుచ్చన్నలు అక్కడి నుండి ఫోన్ ద్వారా తమ బంధువులకు సమాచారం అందించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అక్కడి గ్రామాల ప్రజలు మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టారని తెలిపారు. మీరు ఎక్కడివారో.. మీకు కరోనా ఉండొచ్చు. మా ఊరి నుండి వెళ్ళిపోండని హెచ్చరించడంతో బయటకు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ తోచక గ్రామాలకు దూరంగా గుడిసెలు వేసుకొని ఉంటున్నట్లు పేర్కొన్నారు. 15 రోజులుగా పని లేకుండా ఉండటంతో డబ్బులు, నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.

మమ్మల్ని రప్పించండి

కరోనాతో వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో అందరికీ దూరంగా.. జీవనోపాధి లేకుండా జార్ఖండ్ రాష్ట్రంలో పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు రప్పించాలని ఆ సంచార కుటుంబాలు కోరుతున్నాయి. కాగా వీరంతా కాలినడకను ప్రారంభించారని సమాచారం.

tags: Normal, People, Jharkhand, Ramgarh district, Coronavirus, Lockdown, Telangana
slug:



Next Story

Most Viewed