ఉద్రిక్తత.. విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట

by  |
SFI,-DYFI-Protest
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యారంగ, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మొదట ర్యాలీగా వచ్చిన విద్యార్థి, యువజన సంఘం నేతలు కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గేట్లు దూకి కలెక్టరేట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు నాయకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

BNG-SFI-Leaders

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుగ్గ నవీన్ మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శలు చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయకుండా ఎన్నికలు రాగానే ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతుందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయటంలో ప్రభుత్వ జాప్యం తగదన్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకొని, ఉద్యోగాలు వేసేదాకా నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యయుతంగా విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుంటే అక్రమంగా కేసులు పెట్టి, నిర్బంధించడం నియంత పాలనకు నిదర్శనం అని అన్నారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టులను సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహాంగీర్, నాయకులు కొండమడుగు నర్సింహా, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ పలువురు ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షులు వనం రాజు, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాద్యక్షులు పల్లె మధుకృష్ణ, కవిడె సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు బాసవాడ శైలజ, బుర్రు అనుల్, చెన్న రాజేష్, చింతల శివ, పల్లె శివ, మేడి మధుబాబు, యాదగిరి, బట్టుపల్లి నవీన్, శ్రీకాంత్, సందెల రాజేష్, రాహుల్, గంటెపాక శివ కుమార్, లావుడ్య రాజు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed