TDP : సినిమా చూపించడంలో డీజీపీ ఆర్జీవీని మించిపోయారు- చింతమనేని

by  |
chintamaneni
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. చింతపల్లిలో పోలీసులు వ్యవహరించిన తీరుతో తనకు ఆ రోజే ఆఖరు అనుకున్నాని అన్నారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కావాలని.. సీఆర్పీఎఫ్‌తో రక్షణ కోసం తాను కోర్టుకెళ్తానని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డీజీపీ గౌతం సవాంగ్‌పై మండిపడ్డారు.

రాజకీయ కారణాలతో డీజీపీ తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘చింతమనేని ప్రభాకర్‌పై 84 కేసులు ఉన్నాయని పోలీసు శాఖ ఉపయోగించే ఎంటర్‌ప్రైజెస్ సెర్చ్‌లో చింతమనేని ప్రభాకర్ పేరు కొట్టి కేసుల జాబితాను బయటకు తీశారు. అదే సమయంలో వనజాక్షి కేసు విషయంలో రాజకీయపరమైన విమర్శలు కూడా చేశారు. ఎంటర్‌ప్రైజెస్ సెర్చ్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరును కొడితే 36 కేసులు వస్తాయి’ అని మాజీఎమ్మెల్యే చింతమనేని చెప్పుకొచ్చారు. తనపై నమోదైన కేసుల విషయంలో డీజీపీ తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. తనపై నమోదైన కేసులన్నీ ప్రజల కోసం పోరాడిన సంందర్భంలోవే తప్ప.. దోపిడీలు, దొంగతనాలు, అవినీతి కేసుల్లో నమోదైనవి కాదన్నారు.

ప్రజలపక్షాన పోరాటం చేస్తున్నందు వల్లే తనపై రాజకీయ కుట్రతో కేసుల్లో ఇరికిస్తున్నారని.. ప్రతీ దాంట్లోనూ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే తనపై ఉన్న రౌడీ షీట్‌ను ఎత్తి వేయించుకోవాలనే ప్రయత్నం ఏనాడూ చేయలేదని.. ఎందుకంటే తనకు న్యాయస్థానం పట్ల ఆ నమ్మకం ఉందన్నారు. సినిమా చూపించడంలో ఆర్జీవీని గౌతం సవాంగ్‌ను మించిపోయారని చింతమనేని ప్రభాకర్ ధ్వజమెత్తారు. డీజీపీ స్థానంలో ఉండి రాజకీయ పరమైన విమర్శలు చేయడం డీజీపీకు తగదని.. ఇకనైనా సవాంగ్ పద్ధతి మార్చుకోవాలని చింతమనేని హితవు పలికారు.

Next Story

Most Viewed