హుజూరాబాద్‌పై వైద్యారోగ్య శాఖ స్పెషల్ ఫోకస్..

by  |
Huzurabad
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకున్నది. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదుగానీ రాజకీయ పార్టీలన్నీ ముమ్మరం ప్రచారం చేస్తుండడం, వేలాది మంది జనం గుంపులుగా గుమికూడడాన్ని నిత్యం పరిశీలిస్తూ ఉన్నది. రోజువారీ రిపోర్టులను విశ్లేషిస్తూ ఉన్నది. గతంలో చేసిన టెస్టుల సంఖ్య, పాజిటివిటీ రేటును గత నెలన్నర రోజులుగా ప్రత్యేక దృష్టి పెట్టి అధ్యయనం చేస్తూ ఉన్నది. కేసుల సంఖ్య పెరగకపోవడం వైద్యారోగ్య శాఖ అధికారులకు ఉపశమనంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూలు విడుదలై నోటిఫికేషన్ ప్రక్రియ ముగిసే లోపే ఆ నియోజకవర్గంలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు.

ఇందుకోసం మండలాలవారీగా గణాంకాలను సేకరించారు. నియోజకవర్గంలో సుమారు రెండున్నర లక్షల మంది 18 ఏళ్ల వయసు పైబడినవారు ఉన్నప్పటికీ అక్కడ స్థిరంగా నివాసం ఉంటున్నవారు మాత్రం దాదాపు 1.80 లక్షల మంది మాత్రమేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇందులో ఇప్పటికే 1.20 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జిల్లా, మండల వైద్యాధికారుల నుంచి తెప్పించిన సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇంకా 57 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నట్లు అంచనా వేసి వీలైనంత తొందరగా వారికి టీకాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నారు. గరిష్ఠంగా రెండు వారాల వ్యవధిలోనే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన నియోజకవర్గంగా మారుతుందని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఏయే మండలాల్లో ఒక డోస్ తీసుకుని రెండవ డోస్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు, రెండు డోసులు పూర్తయినవారి సంఖ్య ఎంత, ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బంది సంఖ్య, జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నిల్వ తదితరాలన్నింటి లెక్కలు తేల్చారు. ఒకటి రెండు రోజుల్లోనే ప్రత్యేక డ్రైవ్ పెట్టి వ్యాక్సిన్ తీసుకోనివారికి, మొదటి డోస్ తీసుకుని సెకండ్ డోస్ కోసం సిద్ధంగా ఉండి అర్హులైనవారికి వెంటనే ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతున్నది. ప్రస్తుతానికి 57 వేల మందికి మాత్రమే టీకాలు ఇవ్వాలని గుర్తించినందున పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తే వారం రోజుల్లోనే పూర్తవుతుందని, కానీ గ్రామాలవారీగా విడివిడిగా ఉన్నందున రెండు వారాలు పట్టవచ్చని ఆ అధికారి వివరించారు.



Next Story