ఢిల్లీ అల్లర్లు: హైకోర్టు జడ్జీ బదిలీ!

by  |
justice S Muralidhar
X

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై వాదనలు వింటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్‌కు బదిలీ ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ అల్లర్లకు రెచ్చగొట్టిన, హింసలో పాలుపంచుకున్నవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దాఖలైన పిటిషన్ విచారిస్తూ.. విద్వేష వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ ఎస్ మురళీధర్ ఆదేశించారు. హింసను నియంత్రించడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలను తెప్పించుకుని చూశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఆ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేదంటే ఢిల్లీ పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీలో మరోసారి 1984 అల్లర్లను పునరావృతం కానివ్వబోమని వ్యాఖ్యానించిన తర్వాతి రోజే న్యాయమూర్తికి ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ అందాయి. బుధవారం రాత్రి 11గంటలకు న్యాయమూర్తిని పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్ధరాత్రి పూట న్యాయమూర్తిని బదిలీ చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, ఇది చట్టబద్ధంగా జరిగిన బదిలీ అని కేంద్రం సమర్థించుకుంది.

ఈ బదిలీ నోటిఫికేషన్‌లో కొత్త పోస్టులో ఏ తేదీనాటికి జాయిన్ కావాలన్న సమాచారమేమీ లేదు. వెంటనే జాయిన్ కావాలని సంకేతమిచ్చినట్టు ఈ నోటిఫికేషన్ ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి నోటిఫికేషన్‌లో న్యాయమూర్తులు కొత్త పోస్టులో జాయిన్ అయ్యేందుకు 14 రోజుల సమయాన్నిస్తుంటాయి.

Next Story