వేసవిలోనూ తగ్గిన విద్యుత్ డిమాండ్

by  |
electricity demand
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాధారణంగా వేసవిలో విద్యుత్ కు డిమాండ్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగం మరీ అధికంగా ఉంటుంది. అలాంటిది గ్రేటర్ జోన్ లో గతేడాది మార్చి నుంచి రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా పలు వాణిజ్య సంస్థలు మూతపడటం ఒక కారణమైతే, సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధిలో గతేడాది మేలో విద్యుత్ డిమాండ్ సరాసరి 60 మిలియన్ యూనిట్లుంటే ఏ ఏడాది మే నాటికి 50 మిలియన్ యూనిట్లకు తగ్గింది.

ఏటా 10 శాతం పెరగాల్సింది పోయి తగ్గుదల

గ్రేటర్ లో ప్రతి ఏటా 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. కానీ కొవిడ్ కారణంగా ఈ సీన్ ఇప్పుడు రివర్స్ అయింది. వేసవి దృష్ట్యా డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావంతో రెండేళ్లుగా తగ్గుతోంది. 2020 మే నెలలో సరాసరి 60 మిలియన్ యూనిట్లకు పైగా ఉండగా 50 మిలియన్ యూనిట్లకు తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఎంయూలకు పైగా వినియోగం పడిపోయింది.

సాధారణ సమయాల్లో గ్రేటర్ పరిధిలో 55 మిలియన్ల విద్యుత్ డిమాండ్ ఉంటే.. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో క్రమంగా తగ్గుతూ వస్తోంది. గ్రేటర్ పరిధిలో 2019 మే నెలలో సరాసరి 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే గతేడాది మే నెలలో 60 ఎంయూలకు తగ్గింది. ఏకంగా ఐదు మిలియన్ యూనిట్ల వినియోగం పడిపోయింది. ఇదిలా ఉండగా 2020 మే నెలలో 60 మిలియన్ యూనిట్లున్న డిమాండ్ ఈ ఏడాది మే నాటికి 50 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఏడాది కాలంలో విద్యుత్ డిమాండ్ ఏకంగా 10 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.

వర్షాకాలంతో మరింత తగ్గే చాన్స్

రాబోయే సీజన్ వర్షాకాలం కావడంతో విద్యుత్ కు పెద్దగా డిమాండ్ ఉండదు. అంతేకాకుండా వినియోగం కూడా మరింత తగ్గే అవకాశముంది. అయితే వర్షాకాలంలో వరదలు సంభవించి వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువుంటాయి. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంచుతామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో డిమాండ్ కు తగినంత విద్యుత్ అందుబాటులో ఉందని, లాక్ డౌన్ కారణంగా వినియోగం పడిపోయినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

విద్యుత్ బిల్లులపై ఎఫెక్ట్

పలు వాణిజ్య సంస్థలు మూతపడటం, సాఫ్ట వేర్, ఇతర రంగాల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. అయితే ఈ ఎఫెక్ట్ విద్యుత్ బిల్లులపై పడింది. గ్రేటర్ పరిధిలో గతేడాది మార్చిలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఈ ఏడాది వరకు ప్రతి నెలా రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఆదాయం తగ్గింది. లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం, సంస్థలు మూతపడటంతో అందరూ ఇంటికే పరిమితం కావడంతో గృహ విద్యుత్ వినియోగం సరాసరి 10 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా కమర్షియల్, హెచ్ టీ ల్లో వినియోగం లేక విద్యుత్ సంస్థలకు ఆదాయం భారీగా తగ్గింది. గతేడాది నుంచి విద్యుత్ డిమాండ్ తగ్గడంతో డిస్కంకు సుమారు రూ.125 కోట్లకు పైగా ఆదాయం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed