నిజామాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

by  |
నిజామాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం రేగింది. యూజీసీ కొన్ని దూరవిద్యా సర్టిఫికెట్లకు గుర్తింపును రద్దు చేసిన తరువాత చాలా రోజులకు జిల్లాలో తప్పుడు విద్యార్హత ధృవీకరణ పత్రాల వ్యవహారం వెలుగు చూసింది. కమ్మర్ పల్లి, భీంగల్ మండలాల వ్యవసాయాధికారులు శ్రీహరి, సంజీవ్ కుమార్ లు ఉమ్మడి రాష్ర్టంలో 2009లో వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా ఉద్యోగాలను సాధించారు. వారు పదోన్నతి పొంది ప్రస్తుతం మండల వ్యవసాయ అధికారులుగా పనిచేస్తున్నారు. గత నెలలో ఏడీఏ పదోన్నతుల విషయంలో వారి సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అవి తప్పుడు విద్యార్హత పత్రాలుగా నిర్ధారించారు. వారు బుందేల్ ఖండ్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువలేదని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు విద్యార్హత పత్రాలను సమర్పించి ఉద్యోగాలను పొందారని, ప్రభుత్వాన్ని మోసం చేశారని జిల్లా వ్యవసాయశాఖాధికారి మేకల గోవింద్ నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు సమర్పించిన ధృవీకరణ పత్రాలలో బీఎస్సీ అగ్రికల్చర్ సర్టిఫికెట్లు నకిలీవని తేలడంతో కలకలం రేగింది.

ఉమ్మడి రాష్ర్టంలో కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఎక్కువగా వ్యవసాయ విస్తీర్ణ అధికారుల నియమాకాలు జరిగాయి. అందులో ఏమైనా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయా అనే అనుమానాలు షురువయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో వంద మందికి పైగా నియమితులయ్యారు. రాష్ట్రంలో వందలమంది ఎంపికయ్యారు. వీరిద్దరూ 2009 లో నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొందడమే కాకుండా వీళ్లు పదోన్నతి పొందే వరకూ వ్యవసాయ అధికారులు ఎందుకు గుర్తించలేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరు సామాజిక హక్కుల కార్యకర్తలు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతోనే అవి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లుగా గుర్తించారనే వినికిడి వ్యవసాయ శాఖలో వినబడుతోంది.

2018 వరకు చాలా దూర విద్య యూనివర్సిటీలు వాటి అధ్యయన కేంద్రాల ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో విద్యాబోధన ద్వారా అర్హత పత్రాలను అందించేవి. కేంద్రం యూజీసీ తీసుకువచ్చిన చట్టాల ద్వారా చాలా డిమ్డ్ యూనివర్సిటీల సర్టిఫికెట్లకు ఎలాంటి ప్రమాణీకం లేదని 100 వరకు గుర్తించి, వాటి గుర్తింపును రద్దు చేసింది. అలాంటి విశ్వ విద్యాలయాలలో చాలామంది ఉన్నత చదువులు చదివినట్టు సర్టిఫికెట్లను పొంది సర్కారు కొలువుతోపాటు పదోన్నతులు పొందారు.

ఉమ్మడి రాష్ర్టంలో నిజామాబాద్ జిల్లాలో చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు సైతం దూరవిద్య ద్వారా సర్టిఫికెట్లను సమర్పించి పదోన్నతులు పొందారు. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిగినా అది ఆటకెక్కింది. అదే కోవలో వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు ఉద్యోగాలను, పదోన్నతులను పొందారు. అప్పట్లో క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఆ హడావుడి కొద్ది రోజులకే ముగిసింది. మున్సిపల్, రెవెన్యూ శాఖలో కూడా నాల్గవ తరగతి ఉద్యోగాలకు చాలామంది దొంగ సర్టిఫికెట్లను సమర్పించిన దాఖాలాలు ఉన్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు దూర విద్యా విధానంపై చేసిన మార్గ దర్శకాల కారణంగా కొంత కాలం పాటు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సద్దుమణిగింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కాకతీయ దూర విద్యా కేంద్రం, ప్రొఫెసర్ జి.రాంరెడ్డి దూర విద్యాలయాలకు మాత్రమే యూజీసీ గుర్తింపు ఉంది.

ఇతర రాష్ట్రాల దూరవిద్యకు మన రాష్ట్రంలో యూజీసీ గుర్తింపు లేదు. విద్యార్హత లేకపోయినా ఉన్నట్టు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందడం ద్వారా అర్హులైన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కొన్ని సెక్షన్లలో ఈ వ్యవహారం గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోరన్న వాదనలు ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారులే అర్హత లేకున్నా తమ కుటుంబ సభ్యులను, లంచాలు ఇచ్చిన వారిని ఉద్యోగాలలో నియమింపజేసేందుకు బోగస్ యూనివర్సిటీ సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలను పొందారని సమాచారం. ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్న చాలామంది నకిలీ సర్టిఫికెట్ల ద్వారానే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికి వినిపిస్తున్నాయి.

tags: Nizamabad, fake certificates, government jobs, promotion, charges



Next Story

Most Viewed