గోదావరిఖనిలో మెడికల్ కాలేజీ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోను : డీసీహెచ్ఎస్

by  |
గోదావరిఖనిలో మెడికల్ కాలేజీ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోను : డీసీహెచ్ఎస్
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం జిల్లా డీసీహెచ్ఎస్ వాసుదేవ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆస్పత్రి ముందే తన కారు దిగి నడుచుకుంటూ లోపలికి వచ్చి పలు విభాగాలతో పాటు వార్డులను పరిశీలించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రి మెడికల్ కాలేజీగా మంజూరు అయిందని, దీనికి అదనంగా 85 పడకలకు అనుమతి వచ్చిందన్నారు.

అలాగే ఆస్పత్రిలోని ప్రతీ వైద్యుడు రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రిలోని శానిటేషన్ చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పని తీరును మార్చుకోవాలని సూపర్వైజర్లను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అలాగే, గత కొంత కాలంగా గర్భిణీ మహిళలకు అందించే ఆహారం విషయంలో వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందించామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులకు ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అస్సలు సహించబోమని, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు.

సెక్యూరిటీ గార్డుల పనితీరుపై అసహనం..

ఆస్పత్రిలో కొందరు సెక్యూరిటీ గార్డులు రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి ముందు కారు దిగి లోపలికి వచ్చే వరకు ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంపై మండిపడ్డారు. వారి పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సమానంగా విధులు నిర్వహించాలన్నారు.

ప్రజలకు అన్ని విభాగాల వైద్య సేవలు అందించాలి

గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారని, ఇకమీదట ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అందరూ ఒకే చోట కాకుండా గదులలో ఎవరికి వారు ప్రత్యేక విధులను నిర్వహించాలన్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల కోసం నూతనంగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు గైనకాలజిస్టులు, పిల్లల వైద్యనిపుణులు వచ్చారని వీరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు గైనిక్ పిల్లల వైద్యనిపుణులు రిపోర్ట్ చేశారని త్వరలోనే విధుల్లో చేరుతారని అన్నారు. త్వరలోనే 21 ఎకరాల్లో మెడికల్ కళాశాలను నిర్మిస్తామని వచ్చే సంవత్సరంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులతో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.



Next Story

Most Viewed