వివాదాస్పదంగా అధికారుల తీరు.. మహిళలు అని కూడా చూడకుండా..

by  |
వివాదాస్పదంగా అధికారుల తీరు.. మహిళలు అని కూడా చూడకుండా..
X

దిశ, కరీంనగర్ సిటీ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. పేదలకు ఇచ్చిన భూమిలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాదారులను బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. వారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతలపై కూడా, అధికార యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేయటం పట్ల మండిపడుతున్నారు.

బుగ్గారం గ్రామంలోని 516 సర్వేనెంబర్‌లో నగునూరి సంధ్య, శ్రావణి, జ్యోతి కుటుంబాలకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం సాగు భూమి కేటాయించింది. పట్టాదారు పాసు పుస్తకాలతో పాటు రైతు బంధు కూడా వీరికి మంజూరు చేశారు. ఇటీవల నగర పంచాయతీ పాలకవర్గం పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, దీనిని అడ్డుకున్న పట్టాదారులు ఆ భూమిలోనే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ కూడా అక్కడే జరుపుకున్నారు.

అయినా, అధికారులు బుధవారం పోలీసులను తీసుకుని భూమిలో ఉంటున్న పట్టాదారులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి అధికారులు, పాలకవర్గం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తుందని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

సర్కారు ఇచ్చిన భూమిని లాక్కొమ్మని ముఖ్యమంత్రి చెప్పారా? టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందా? బహిర్గతం చేయాలంటూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఈ మొత్తం వ్యవహారమంతా మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ కలిసే నడుపుతున్నారంటూ మండిపడ్డారు. లబ్దిదారుల భూములు లాక్కున్నట్టైతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed