గ్రీన్ సిగ్నల్.. ఇక మారుమూల ప్రాంతాల్లోనూ టెలికాం సేవలు!

by  |
telecom sector
X

దిశ, వెబ్‌డెస్క్: ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందించలేని మారుమూల ప్రాంతాల్లో టెలికాం నెట్‌వర్క్‌లో శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునేందుకు టెలికాం విభాగం అత్యున్నత సంస్థ డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్(డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టెలికాం సెక్రటరీ అన్షు ప్రకాష్ చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ వేయడానికి వీలు కాని ప్రాంతాల్లో, కఠిన భూభాగం ఉన్నచోట మొబైల్ టవర్లకు అనుసంధానం చేసేందుకు శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించుకోవచ్చు. దూరం ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ అందించడంలో సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

వ్యాపారం సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు మేరకు శాటిలైట్ కనెక్టివిటీ వినియోగానికి డీసీసీ ఆమోదించినట్టు అన్షు ప్రకాష్ వివరించారు. దీంతో పాటు ఇటీవల 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల అదనపు నిధులతో భారత్‌నెట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం టెలికాం శాఖ వారం రోజుల్లో టెండర్లను ఆహ్వానించనుంది.

Next Story

Most Viewed