డీసీబీ బ్యాంకు త్రైమాసిక లాభం 28 శాతం క్షీణత!

by  |
డీసీబీ బ్యాంకు త్రైమాసిక లాభం 28 శాతం క్షీణత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో డీసీబీ బ్యాంకు రూ. 69 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 96 కోట్లతో పోలిస్తే 28 శాతం తగ్గినట్టు సంస్థ ప్రకటించింది. ఆదాయం గతేడాదితో పోల్చితే 8.5 శాతం పెరిగి రూ. 434 కోట్లకు చేరిందని వెల్లడించింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ. 338 కోట్లతో 4 శాతం పెరిగినట్టు, ఆదాయం 10.5 శాతం పెరిగి రూ. 1,656 కోట్లకు చేరినట్టు తెలిపింది. కొవిడ్-19 ప్రభావం నుంచి నిలదొక్కుకునేందుకు రూ. 63 కోట్లను కేటాయించామని, దీనివల్లే పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు, చివరి త్రైమాసికంలో లాభం తగ్గినట్టు బ్యాంకు పేర్కొంది. ఆర్‌బీఐ సూచించిన మార్గదర్శకాల కంటే అధికంగా కరోనాను ఎదుర్కోవడానికి కేటాయించామని డీసీబీ బ్యాంకు వెల్లడించింది. ఇక, 2020 మార్చి చివరి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 1.84 శాతం నుంచి 2.46 శాతానికి పెరిగినట్టు, నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 0.65 శాతం నుంచి 1.16 శాతం పెరిగినట్టు బ్యాంకు పేర్కొంది.

డీసీబీ బ్యాంకు ఎండీ, సీఈవో మురళి ఎం. నటరాజన్ మాట్లాడుతూ..’రానున్న రెండు త్రైమాసికాలలో మా ప్రధాన లక్ష్యం పోర్ట్‌ఫోలియో ఒత్తిడిని అధిగమించడం, రుణ వినియోగదారులకు సాయం చేయడం, ఖర్చులను తగ్గించుకోవడం, నిర్వహణపై దృష్టి సారించడం, తగినంత ద్రవ్యత కొనసాగించడమని’ అన్నారు.



Next Story

Most Viewed