4.39 కోట్ల మంది ఇన్వెస్టర్ల వివరాలు బహిర్గతం.. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ

by  |
Data breach
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే మదుపర్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని భద్రపరిచే సీడీఎస్ఎల్ వెంచర్స్‌లో ప్రధాన లోపం బయటపడింది. ఇన్వెస్టర్ల సమాచారం నిల్వ చేసే టెక్నాలజీలో లోపం కారణంగా ఏకంగా 4.39 కోట్ల మందికి చెందిన కీలక సమాచారం బహిర్గతమైందని సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ కంపెనీ సైబర్ఎక్స్ 9 ఓ ప్రకటనలో తెలిపింది. పది రోజుల్లో 4.39 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు రెండుసార్లు బహిర్గతం అయినట్టు కంపెనీ పేర్కొంది. సైబర్ఎక్స్9 కంపెనీ ఈ లోపం గురించి సీడీఎస్ఎల్‌కు వివరాలు అందించినట్టు తెలిపింది. దీనిపై స్పందించిన సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్లకు చెందిన సమాచారానికి ఎటువంటి ముప్పు లేదని, సీడీఎస్ఎల్ వెంచర్స్‌లో జరిగిందని చిన్న లోపం మాత్రమే అని, దాన్ని వెంటనే పరిష్కరించినట్టు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

సెబీ వద్ద నమోదైన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్)కు అనుబంధ సంస్థగా సీడీఎస్ఎల్ వెంచర్స్ లిమిటెడ్ ఉంది. ఈ కంపెనీ కూడా సెబీ వద్ద నమోదైంది. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు మదుపర్ల వివరాలతో పాటు పలు కీలక వివరాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. కాగా, ఈ లోపం వల్ల ఇన్వెస్టర్లకు సంబంధించిన పేర్లు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, పాన్, ఆదాయం సహా ఇతర వ్యక్తిగత వివరాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. ఈ సమాచారం ద్వారా ఆర్థిక నేరగాళ్లు మోసాలకు పాల్పడవచ్చని సైబర్ఎక్స్9 సంస్థ అభిప్రాయపడింది.



Next Story

Most Viewed