‘అత్యంత ప్రమాదకరమైన దాడి’.. ఆ ఇద్దరు ప్రొఫెసర్ల తొలగింపుపై విద్యావేత్తల ఆందోళన

by  |
pb mehata, aravind subramaniyan
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానాలోని సోనెపట్‌లో గల అశోక విశ్వవిద్యాలయం చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ప్రతాప్ భాను మెహతా, ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్‌ల రాజీనామా ఇప్పుడు సదరు విశ్వవిద్యాలయానికి కొత్త తలనొప్పులను తీసుకొస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో అశోక వర్సిటీ నిర్వాహకులు ఈ ఇద్దరినీ అక్కడ్నుంచి వెళ్లిపోయేలా ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే విషయమై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వర్సిటీలలో పనిచేస్తున్న సుమారు 150 మంది విద్యావేత్తలు అశోక యూనివర్సిటీ నిర్వాహకులకు, ట్రస్టీలకు బహిరంగ లేఖ రాశారు. వారిద్దరి తొలగింపు చర్య విద్యా వ్యవస్థ స్వేచ్ఛపై అత్యంత ప్రమాదకరమైన దాడిగా అభివర్ణించారు. లేఖపై హార్వర్డ్, బర్కెలీ స్కూల్ ఆఫ్ లా, పెన్సల్వేనియా, యేల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు.

‘భారత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కారణంతో ప్రముఖ విద్యావేత్త ప్రతాప్ భాను మెహతాను వర్సిటీ నుంచి బలవంతంగా వెళ్లిపోయేలా ఒత్తిడి తీసుకురావడం దారుణం. ఇది విద్యా స్వేచ్ఛపై దాడిగానే భావించవలసి ఉంటుంది. విశ్వవిద్యాలయం అంటే నిర్భయమైన విచారణ, విమర్శలకు నిలయంగా ఉండాలి. పీబీ మెహతాకు మా మద్దతు ప్రకటిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. విద్యావేత్తలే గాక రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా మెహతాకు సంఘీభావం తెలిపారు. స్వేచ్ఛా ప్రసంగం అనేది విశ్వవిద్యాలయాలకు ఆత్మ వంటిదని, దానిపై రాజీ పడితే వర్సిటీలు వాటి ఆత్మను కోల్పోయేనట్టేనని ఆయన వ్యాఖ్యానించారు.

2019లో అశోక వైస్ ఛాన్సెలర్ పదవి నుంచి వైదొలిగిన పీబీ మెహతా.. ఇటీవలే ప్రొఫెసర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయనతో పాటు అరవింద్ సుబ్రహ్మణ్యన్ కూడా మెహతా బాటలోనే పయనించారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే కారణంతో వర్సిటీ యాజమాన్యం వారి రాజీనామాను కోరిందని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇలా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed