చివరి శ్వాస వరకు టీఆర్‌ఎస్‌లోనే: దానం నాగేందర్

by  |
చివరి శ్వాస వరకు టీఆర్‌ఎస్‌లోనే: దానం నాగేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో కొందరు నేతల వ్యవహారశైలి నచ్చకనే ఆ పార్టీ నుంచి తాను బయటకు వచ్చానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు కొత్త బిచ్చగాళ్లు ‘ఇక కేసీఆర్ నుంచి గుంజుకునుడే’ అంటున్నారని, గుంజుకోవడానికి ఇది ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. రేవంత్ తీరు ‘మూతి లేదు తోక లేదు’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నారని, అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆధునిక దేవాలయం అని అభివర్ణించారు. ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిందిపోయి అదే పనిగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో తాను మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధి ఇపుడు జరుగుతోందన్నారు. దళిత సాధికారిత కింద సీఎం తెస్తున్న పథకం గొప్పదని కొనియాడారు.

నిబంధనలు పాటించాలి

సోషల్ మీడియాకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని నాగేందర్ గుర్తు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసినవారిపై సైబర్ క్రైమ్స్ విభాగానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను పార్టీ మారేది లేదని, చివరి శ్వాస వరకు టీఆర్‌ఎస్‌తోనే ఉంటానని, విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పని చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌లో సీనియర్‌లకు చీము, నెత్తురుంటే బయటకు రావాలి. రేవంత్ కింద పనిచేస్తారా? ఆలోచించుకోవాలి’ అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ లేదన్నారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నవాడు ఎలా పనిచేస్తాడో అందరికి తెలుసని విమర్శించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానాలు చాలా జరిగాయని, కాంగ్రెస్ కంటే తనకు టీఆర్‌ఎస్‌లో వందింతలు ఎక్కువ గౌరవం దొరుకుతోందని అన్నారు. తాను మంత్రి పదవి అడగలేదని, అడగనని మీడియాకు దానం నాగేందర్ వివరించారు.



Next Story

Most Viewed