దారుణం.. ఒకరోజు కూలీ 35 రూపాయలంట!

by  |
దారుణం.. ఒకరోజు కూలీ 35 రూపాయలంట!
X

దిశ, న్యూస్‌ బ్యూరో : ఉపాధిహామీ కూలీలకు దినసరి కూలీ డబ్బులు రెండు అంకెల సంఖ్య దాటడం లేదు. రూ.237 ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం గొప్పలకే పరిమితం అయింది. రెండు వారాలు పనిచేస్తే ఒకే వారం డబ్బులు వస్తున్నాయని కూలీలు వాపోతున్నారు. పని కోసం దరఖాస్తు చేసుకుంటే వారాలు గడుస్తున్నా అవకాశం రావట్లేదు. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఉపాధి కరువై గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులవైపు మళ్లారు. రాష్ట్రంలో మొత్తం జాబ్‌కార్డులు 55.71 లక్షలు ఉండగా.. ఇందులో యాక్టివ్ కార్డులు 31.45 లక్షలు.. పనిచేస్తున్నవారు 1.19 కోట్ల మంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 30 శాతం మంది ఉపాధి పనులకు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందరికీ ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొక్కుబడిగా మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయి. గ్రామంలో 400 మంది కూలీలు, 15 గ్రూప్‌లు ఉంటే వారంలో రెండు, మూడు గ్రూప్‌లకు మాత్రమే ఉపాధి దొరుకుతోంది. ఉపాధి కూలీ రేటును కేంద్రం రూ. 212 చొప్పున ఇస్తుండగా రూ.237 అందిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం కూలీ రూ.100 కూడా దాటడంలేదు.

నిజామాబాద్‌లో కూలీ @ రూ.35..

నిజామాబాద్ జిల్లోని మోస్రా మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో రోజువారి కూలీ రూ. 35 మాత్రమే పడుతున్నాయని స్వయాన ఉపాధి హామీ టెక్నికల్ ఆఫీసర్ చెప్పారు. ఆ గ్రామంలో కూలీలు ధర్నా కూడా చేశారు. అర్బన్ వరంగల్ జిల్లాలోని శీతంపేట గ్రామంలో కూలీలు వారం రోజులు పనిచేస్తే దినసరి కూలీ రూ. 50 చొప్పునే లెక్కకట్టారు. దీంతో పేమెంట్ ఐడీ యాక్సెప్ట్ చేయడంలేదు. కారణం మూడంకెల వేతనం లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఒప్పుకోదు. దీంతో మరో వారం పనిచేస్తే వాటిని కూడా కలిపి ఎంట్రీ చేస్తామంటూ సిబ్బంది కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఎవరైనా కూలీలు అధికారులను నిలదీస్తే ఇష్టం ఉంటే పనిచేయి లేదంటే ఊరుకో అనే బెదిరిస్తున్నారు.

అందని కూలీ డబ్బులు…

కార్మికులకు వేతన చెల్లింపులకు సంబంధించి ఇచ్చే పే స్లిప్‌లు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. దీంతో సూర్యాపేట జిల్లాలో ఐదు వారాలకు సంబంధించి ఏ వారంలో ఎంత చొప్పున కూలీ డబ్బులు మంజూరయ్యాయో తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక వేసవి కాలంలో ఇచ్చే సమ్మర్ అలవెన్స్‌ మాటే లేదు. చేసిన పనికి 30 శాతం సమ్మర్ అలవెన్స్ రూపంలో చేర్చాలి. నీళ్ల బిల్లు, తట్ట, పార, బిల్లులు కూడా చెల్లిండం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. పనికోసం దరఖాస్తు చేసుకున్న కూలీలకు పని మంజూరైనా ‘డిమాండ్ మస్టర్’ ఇవ్వడంలేదు. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో జాబ్‌కార్డు జారీ చేయాలని చట్టం చెప్తున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed