కడుపు మాడ్చుతున్న కరోనా

by  |
కడుపు మాడ్చుతున్న కరోనా
X

దిశ, న్యూస్ బ్యూరో: యావత్ ప్రపంచాన్ని పట్టిపిడీస్తున్న కరోనా వ్యాధి ప్రభావం దినసరి కూలీల ఉపాధిపైనా పడింది. మామూలు రోజుల్లోనే అడ్డాకూలీలకు చేతినిండా పనిదొరుకుడు అంతంత మాత్రం. దీనికి తోడు కరోనా వైరస్ విజృంభన అడ్డాకూలీల ఉపాధి అవకాశాలకు మరింత కోత విధిస్తోంది. కరోనా వ్యాధి భయంతో కూలీలను పనికి పిలిచే నాథుడే కరువయ్యాడు. నెల రోజులుగా సరిగ్గా పనులు దొరక్క.. అడ్డాకూలీలు కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి సైతం హైదరాబాద్‌ మహానగరానికి కూలీ పనుల కోసం వచ్చే వారే సంఖ్య ఎక్కువే. అడ్డాకూలీలుగా జీవనం సాగిస్తున్న వీరి పరిస్థితి దినదిన గండంగానే సాగుతుంటుంది. సాధారణ రోజుల్లో నెలలో 20 రోజులు పనిదొరకడమే గగనం. కాగా, ప్రస్తుతం కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను వణికిస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వ్యాపార సంస్థలను ఈ నెల 31వరకు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల పరిస్థితి మరింత జఠిలంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ పనులు నిలిచిపోవడంతో దినసరి కూలీలకు పనులు దొరకడం లేదు. పొద్దున్నే 8 గంటలకు సద్ది మూటతో అడ్డామీదికి వస్తున్న కూలీలు.. పనుల కోసం చూసీచూసి.. చివరికి తెచ్చుకున్న సద్ది తినేసి వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. రోజూ పనిచేస్తేనే పూటగడవని దీనమైన స్థితిలో నెల రోజుల నుంచి వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే పనిదొరుకుతుండటంతో ఇళ్లు గడవడం కష్టంగా మారిందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు చెల్లించక పోవడంతో ఇంటి యాజమానులు ఇల్లు ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగం మా కడుపు మాడ్చుతుందని వాపోతున్నారు. అడ్డాకూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఇతర రాష్ర్టాలైన ఉత్తర ప్రదేశ్‌లో దినసరి కూలీలకు రూ.1,000 ఇస్తుండగా.. కేరళ ప్రభుత్వం రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులు, పింఛన్‌దారులకు ఒకేసారి రెండు నెలల పింఛన్ డబ్బులు, పింఛన్ లేని కుటుంబాలకు రూ.1,300 ఇస్తోంది. కాగా, తెలంగాణలోనూ రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులతో పాటు ఆర్థిక సాయం అందించాలని అడ్డాకూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రెండు వారాల నుంచి పనిదొరకడం లేదు : సంగయ్య, అడ్డా కూలీ, వికారాబాద్

20 ఏండ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్న.కానీ, ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడు చూడలేదు. రోజు కూలీ చేస్తేనే కుటుంబం గడుస్తుంది. నేను ఒక్కడిని పనిచేస్తే వచ్చే కూలీ డబ్బుల మీదనే నా ముగ్గురు పిల్లలు జీవనం ఆధారపడి ఉంది. నెల రోజుల నుంచి సరిగ పనులు దొరక్కపోవడంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. రూ. 5 వడ్డీ చొప్పున డబ్బులు అప్పు తెచ్చి ఇంటి అద్దె చెల్లించా. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

ఇల్లు ఖాళీ చేయమంటున్నరు : కాట్రావత్ లలిత, కూలీ, మహబూబ్‌నగర్

నెల రోజులుగా పనిలేక ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యాజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నడు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ మాయదారి కరోనా రోగం మా ప్రాణాలు తీసేందుకే వచ్చినట్లుంది. పనులు లేక ఒక పూట తినిమరో పూట పస్తులుంటున్నాం. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకొని అడ్డాకూలీలను ఆదుకోవాలి.

tags : Corona, daily labour, No work, struggling for livelihood


Next Story

Most Viewed