ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్

by  |
ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్
X

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ మొబైల్ యాప్‌ను సైబర్ నేరగాళ్లు రూపొందించి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచారు. ఇది గమనించిన తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ డైరెక్టర్ జి.వెంకటేశ్వరరావు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు భాషలో ‘ధరణి తెలంగాణ ల్యాండ్స్ రికార్డ్స్’పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్‌లో ఆర్ఓఆర్, పహణి, ఫారం బి1 వివరాలను తెలుసుకోవడానికి రూపొందించబడినట్టుగా అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ అయిన ధరణి వెబ్ సైట్ లాగా ఉండే ఈ యాప్‌ను మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించేలా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంచారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్ పోలీసులు ఐపీ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేశ్, ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్స్ పేరుతో ఎలాంటి మొబైల్ అప్లికేషన్‌ను తయారు చేయనందున ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.

Next Story

Most Viewed