రైతుబంధు పేరుతో సబ్సిడీకి కోత.. ఇబ్బందుల్లో అన్నదాతలు..

by  |
రైతుబంధు పేరుతో సబ్సిడీకి కోత.. ఇబ్బందుల్లో అన్నదాతలు..
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలోని రైతులను రైతుబంధుతోనే అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని ప్రభుత్వం చేప్పుకుంటుంది. గత మూడేండ్లుగా ఏ ఒక్క సామాన్య రైతుకు సబ్సిడీ కింద పనుముట్లు ఇవ్వలేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాలోని రైతులకు సబ్సిడీ పరికరాలు అందకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు ఇస్తున్నామనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో పనిముట్లు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. సుమారుగా మూడేండ్లుగా ఈ పనిముట్లు ఇవ్వడం లేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు.

రైతు బంధు ఇవ్వడంతో యంత్ర పరికరాలకు నిధుల కోత విధిస్తున్నట్లు అధికారులే వివరిస్తున్నారు. వ్యవసాయ సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, కేజ్విల్, కల్టివేటర్లు, కలుపు నివారణలకు సంబంధించిన యంత్రాలను రైతులు వినియోగిస్తారు. ఈ యంత్రాలు కొనుగోలు చేసేందుకు రైతులకు ఆర్ధిక భారమైయింది. గతంలో సబ్సిడీతో యంత్రాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడటంతో సాగు పెంపుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. దీంతో వ్యవసాయానికి వినియోగించే పరికరాల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. సబ్సిడీ పై వచ్చే ట్రాక్టర్లపై రాజకీయం నడుస్తోంది. దీంతో రైతులను పట్టించుకోవడమే మర్చిపోయారు. కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల అనుచరులకే సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రయాత్నలు చేస్తున్నారు. గతంలో పంపిణీ చేసిన సబ్సిడీ ట్రాక్టర్లను అధికార పార్టీ నేతలకే అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో పెరిగిన సాగు..

ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగిపోయాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిపోయింది. జిల్లాలో 4,72,000 ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా వరిసాగు చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాతనే కందులు, పత్తి, మిగత పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ ఆధునిక పరికరాలు లేకపోవడంతో రైతులకు ఆర్ధిక భారం పెరిగిపోతుంది. కూలీ ధరలు భాగా పెరిగిపోయాయి. అందుకు తోడు కూలీల కొరత గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. ఇందుకోసం యంత్రాలను వాడుకోవాల్సిన అవసరం రైతులకు వచ్చింది. ప్రభుత్వ సహాకారం లేకపోవడంతో యంత్రాల కొనుగోలు భారమైయింది. సబ్సిడీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే ట్రాక్టర్లు, పవర్స్ర్పేయర్లు పంపిణీ చేయాలని రైతులు కొరుతున్నారు.

మర్చిపోయారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2010లో యంత్రలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి ట్రాక్టర్లను అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో రైతులు ఇతర యంత్ర పరికరాల కంటే ట్రాక్టర్లు తీసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి రైతుకు 2.20ఎకరాల భూమి ఉంటే సబ్సిడీ ట్రాక్టర్ పొందడానికి అర్హత ఉంది. అయితే రైతులు ట్రాక్టర్ల కొనుగొలుకు పోటీపడుతున్నారు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వమే చెల్లించడంతో యంత్రలక్ష్మి పథకం ముందుకు సాగింది. 2017–18 తర్వాత నిధుల కొరత ఉండటంతో పథకం నిలిపివేసినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉన్న బకాయిలను మాత్రం ప్రభుత్వం చెల్లిస్తోంది. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లతో పాటు రొటోవేటర్లు, వరి నాట్ల యంత్రాలు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్పేయర్లు, నీటి సరఫరా పంపులు, టార్ఫాలిన్లు 50శాతం రాయితీతో అందిస్తారు. సబ్సిడీ ట్రాక్టర్లు కాకుండా కనీసం ఇతర పనిముట్లు కూడా రాకుండా పోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూస్వాములకే లాభం.. –ఇమ్మడి ప్రవీణ్, అమీర్ పేట్ గ్రామం రైతు

గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి రైతులకు సంబధించిన మందు డబ్బాలు(స్పెరే), పాడలు, విత్తనాలు కూడా సబ్సిడీ లో ఇవ్వడం లేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తానాన్ని చెప్పి నేటికీ కూడా చేయలేదన్నారు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ట్రాక్టర్లు ఇచ్చారు తప్ప అసలైన రైతులకు ఇవ్వడం లేదు. ప్రభుత్వం రైతు బందు ఇచ్చి చేతులు దూలిపేసుకుంటుంది. రైతు బంధు వల్ల భూస్వాములే ఎక్కువ లాభం పొందుతున్నారు.

అధికార పార్టీకే అన్ని.. – వెంకట్ రెడ్డి, మోహబ్బత్ నగర్ గ్రామం రైతు

అగ్రీ కల్చర్ ఆఫీసుకు వెళ్లి అధికారులను అడిగాం. పుదీనా తోటలో కలుపు కోత యంత్రం అడిగితే లేదన్నారు. సబ్సిడీ విత్తనాలు, మందు డబ్బా, అడిగినా వ్యవసాయ అధికారులు లేదన్నారు. మూడేండ్ల కిందట సబ్సిడీ కింద ఇచ్చిన ట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులకే పంపిణీ చేశారు.


Next Story

Most Viewed