లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: మార్చి 31, 2023

by Disha Web Desk 17 |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: మార్చి 31, 2023
X

తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీలు:

తెలంగాణలో 2021-22 ఏడాదికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రమాణాల ప్రాతిపదికన ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయించింది. మొత్తం 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా -కె పంచాయతీకి 3 విభాగాల్లో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం 2 విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీకి 2 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది.

రాష్ట్రంలో ఉత్తమ శిక్షణ సంస్థలు:

1. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్‌డీ)

2. రాజేంద్రనగర్ విస్తరణ కేంద్రం(ఈటీసీ)

3. హసన్‌పర్తిలోని విస్తరణ కేంద్రాల (ఈటీసీ)ను పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది.

సీసీఐ సీఎండీగా లలిత్ కుమార్ గుప్తా:

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా లలిత్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు జౌళి శాఖ లలిత్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్ (ఫైనాన్స్) గా సేవలందిస్తున్నారు. సీసీఐకి సీఎండీగా 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు.

సర్ఫింగ్ చేస్తున్న అత్యధిక వయస్కుడిగా సీచీ గిన్నిస్ రికార్డు:

89 ఏళ్ల ఓ వృద్ధుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యంత వృద్ధ సర్ఫర్‌గా గుర్తింపు పొందారు. జపాన్‌లోని ఫుజిసవా నగరానికి చెందిన సీచీ సానోకు ప్రపంచంలో సర్ఫింగ్ చేస్తున్న అత్యధిక వయస్కుడిగా గిన్నిస్ రికార్డు దక్కింది. ఈయన 80 ఏళ్ల వయసులో సర్ఫింగ్ ప్రారంభించారు.

యంగ్ గ్లోబల్ లీడర్స్ - 23 జాబితాలో ఆదిత్య ఠాక్రే:

ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించిన ప్రపంచ యువ నేతల జాబితాలో భారత్‌కు చెందిన ఆరుగురికి చోటు లభించింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) యువ నేత ఆదిత్య ఠాక్రే భాజపా యువ మోర్చా ఉపాద్యక్షుడు మధుకేశ్వర్ దేశాయ్, టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు, జియో హాప్టిక్ టెక్నాలజీస్ సీఈవో ఆకృత్ వైష్, బయోజీన్ సీఈవో విబిన్ బిజోసెఫ్, పాలసీ 4.0 పరిశోధన సంస్థ సీఈవో తన్వీ రత్నలు ఉన్నారు. 40 ఏళ్ల లోపు ఉన్న యువ నేతలను ఇందుకు ఎంపిక చేశామని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. వీరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ మార్పుల వంటి రంగాల్లో కృషి చేసినట్లు తెలిపింది.

పాస్‌పోర్ట్ సూచీలో దిగువకు భారత ర్యాంకు:

వార్షిక పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింత దిగువకు చేరింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144 వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు భారతదేశ మొబిలిటీ స్కోర్ 2019లో 71 ఉండగా 2020లో కరోనా ఆంక్షల కారణంగా 47 కు తగ్గింది. ఆంక్షలు తొలగించిన తర్వాత 2022 లో మళ్లీ 73 స్కోర్ సాధించగా, ఈ ఏడాది 70 కి తగ్గింది. 172 మొబిలిటీ స్కోర్‌తో జపాన్‌ 26వ స్థానంలో ఉంది. విదేశాల్లో వీసా లేకుండా ప్రయాణం, వీసా ఆన్ అరైవల్, ఈ వీసా వంటి సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకుని ఆర్టన్ క్యాపిటల్ సంస్థ మొబిలిటీ స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది.

ఐబీఏ ఉపాధ్యక్షుడిగా అజయ్ సింగ్:

భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఐబీఏ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2023 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఐసీసీ ర్యాంకింగ్స్:

ఐసీసీ వన్డే బ్యాటర్లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 8వ స్థానంలో నిలిచాడు. తాజా జాబితాలో ఒక స్థానం మెరెగుపరుచుకున్నాడు. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్(5) ఉత్తమ ర్యాంకు సాధించగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో నిలిచాడు.

బౌలర్లలో భారత్ నుంచి మహ్మద్ సిరాజ్ 3వ ర్యాంకు సాధించి టాప్ 10లో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టి20ల్లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉండగా.. భారత్ నుంచి యాదవ్ తర్వాత కోహ్లీ (16)మాత్రమే టాప్ 20లో ఉన్నాడు.

దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం:

రాజస్థాన్ క్రికెట్ సంఘం దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనుంది. జైపూర్ జిల్లాలోని చోన్ప్ గ్రామంలో ఈ స్టేడియం నిర్మించేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో 75,000 సీట్ల సామర్థ్యంతో స్టేడియం రూపుదిద్దుకోనుంది. దేశంలో నరేంద్ర మోడీ స్టేడియం (అహ్మదాబాద్) తర్వాత ఇదే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.


Next Story

Most Viewed