తప్పుడు బులెటిన్లు ఇస్తే ఊరుకోం

by  |
High court
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఐపీఎల్ క్రికెట్ స్కోరు వివరాలను పట్టిక రూపంలో ప్రసారం చేస్తున్న తీరులో ప్రతీరోజు హెల్త్ బులెటిన్‌లలో సమస్త సమాచారం ఉండాలని, తప్పులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు బులెటిన్లు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ అందక 38మంది చనిపోవడంపై మందలించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు కోర్టు విచారణకు మంగళవారం నేరుగా హాజరయ్యారు.

హైకోర్టు ఆదేశాలను అమలుచేయడంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తు.చ. తప్పక పాటిస్తామని హైకోర్టుకు సీఎస్ హామీ ఇచ్చారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. అమలు చేసిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసి ఈ విచారణకు మరోసారి నేరుగా హాజరుకావాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది.

ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం

హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ సందర్భంగా ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. కరోనా కేసులు పెరుగుతున్నా నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వ్యాఖ్యానించి ఎందుకు కొవిడ్ పరీక్షలు జరపడం లేని నిలదీసింది. మారుమూల జిల్లాల్లో కరోనా కారణంగా అనేకమంది చనిపోతున్నారని గుర్తుచేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక, ఆక్సిజన్ అందక ఇటీవల 38 మంది చనిపోయారని ప్రస్తావించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారని సీఎస్‌ను, వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. ఆదిలాబాద్, ఆసిఫ్‌నగర్ లాంటి జిల్లాల్లో కరోనాతో అనేక మంది చనిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా జిల్లాలో కరోనాపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారని ప్రశ్నించింది. ప్రజలకు సమాచారం అందించాలని హైకోర్టు చెప్పినప్పటికీ నెల రోజులు దాటినా ఎందుకు పాటించడం లేదని సూటిగానే ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్‌లు ఉన్నాయి, ఎన్ని వెంటిలెటర్లు ఉన్నాయి. ఎంతమంది చికిత్స పొందుతున్నారు తదితర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. హెల్త్ బులెటిన్‌లలో తప్పులు ఉంటున్నాయంటూ పత్రికల్లో టీవీ ఛానెళ్ళలో వార్తలు వస్తున్నాయని తెలిపింది.

సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలి

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ స్కోరు తదితర వివరాలను పట్టిక రూపంలో ఇస్తున్నట్లుగానే ప్రతీరోజు హెల్త్ బులెటిన్‌లో సమస్త సమాచారం ఉండాలని, తప్పులు దొర్లితే ఊరుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతీ రోజు పత్రికల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని, అవసరమైతే నిర్దిష్టమైన న్యూస్ ఏజెన్సీ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని సూచించింది. ఇలాంటి సమాచారం ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రజలకు వైరస్ తీవ్రత అర్థమవుతుందని, వాస్తవాలు తెలుస్తాయని పేర్కొంది.

తు.చ. తప్పకుండా పాటిస్తామన్న సీఎస్

రాష్ట్రంలో కరోనాను నివారించడాని ప్రభుత్వం అన్ని చర్యలనూ చేపడుతోందని ప్రధాన కార్యదర్శి ఈ విచారణ సందర్భంగా హైకోర్టుకు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 3.80 లక్షల టెస్టులు (ఆర్‌టీ-పీసీఆర్‌తో కలిపి) చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో సైతం కరోనా చికిత్సను అందిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1,085 కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటుచేశామని, కొన్ని హోటళ్ళలో ఐసొలేషన్ కోసం 857గదులను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 248 మంది కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు వీటిలో ఉన్నారని తెలిపారు. కరోనా నివారణ కోసం జీహెచ్ఎంసీ, వైద్యారోగ్యం, పోలీసు తదితర పలు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతీ రోజు పత్రికలలో పూర్తిస్థాయి వివరాలను బులెటిన్ రూపంలో ప్రచురించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమాచార హక్కు కమిషనర్ అరవింద్ కుమార్‌కు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలేవి : హైకోర్టు

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి పిర్యాదులు వస్తున్నాయని, ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని, వీటిని నివారించడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడంలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రుల్లో ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేయాలో ఇప్పటికే హైకోర్టు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసిందని డివిజన్ బెంచ్ గుర్తుచేసింది. ఆ ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదని సీఎస్‌ను నిలదీసింది.

దీనికి స్పందించిన సీఎస్, ఫిర్యాదులు వచ్చిన కొన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు నోటిసులు ఇచ్చామని, హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని ఆసుపత్రులపై నిఘా ఉంచమని డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇప్పటివరకు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల నుంచి 726 ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ పేషెంట్లను ఆసుపత్రుల్లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తామని తెలిపారు. ప్రతి ఆసుపత్రి దగ్గర డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్లు, పోలీసులు వైద్య సిబ్బంది నిరంతరం కరోనా నివారణకు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఎంఆర్ఐ, సి.టి. స్కాన్‌లపై ఛార్జీల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకుండా వస్తున్న కరోనా పాజిటివ్ కేసులే ఎక్కువగా ఉన్నాయని వివరించారు.

ర్యాపిడ్ టెస్టులపై నిపుణుల కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 3.50 లక్షల ర్యాపిడ్ టెస్టుల్ని చేశామని, ప్రస్తుతం రెండు లక్షల కిట్లను వాడుతూ ఉన్నామని, ఇంకా నాలుగు లక్షల కిట్లను సమకూర్చుకుంటున్నట్లు సీఎస్ వివరించారు. డివిజన్ బెంచ్ జోక్యం చేసుకుని ర్యాపిడ్ టెస్టు కిట్ల ఫలితాలు సంతృప్తికరంగా లేవన్న ఉద్దేశంతో రాజస్థాన్ ప్రభుత్వం వీటి వాడకాన్ని నిలిపివేసిందని గుర్తుచేసింది. కేవలం 40% మేర మాత్రమే సంతృప్తికర ఫలితాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని ఉదహరించింది. వైద్య నిపుణులతో ఒక కమిటీ వేసి ర్యాపిడ్ కిట్ల వినియోగం, వస్తున్న ఫలితాలపై అధ్యయనం చేయాలని సీఎస్‌కు హైకోర్టు సూచించింది.

పేద ప్రజల కోసం ఫంక్షన్‌ హాళ్ళు, కమ్యూనిటీ సెంటర్లు, వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్లను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఎక్కువగా 21-50 సంవత్సరాల మధ్య వయసువారే కరోనా బారిన పడుతున్నారని సీఎస్ పేర్కొన్నారు. నివారణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామని వివరించారు. హోటళ్ళలో ఉన్న, హోమ్ ఐసొలేషన్‌లో ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్లకు వైద్యపరంగా తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి 170 మంది ప్రైవేటు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, ప్రతీ ఒక్కరు 50-70 మంది పేషెంట్లను చూస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ‘హితం’ అనే మొబైల్ యాప్ ద్వారా డాక్టర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఫ్యామిటీ డాక్టర్ తరహాలో వీరు పేషెంట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసి మరోసారి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్ట్ 13వ తేదీకి వాయిదా వేసింది. ఆ విచారణకు సీఎస్ నేరుగా హాజరుకావాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed