సీఎస్ ఆర్డర్లు విమర్శల పాలు

by  |
సీఎస్ ఆర్డర్లు విమర్శల పాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పాలనాధికారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు విమర్శల పాలవుతున్నాయి. ఉద్యోగుల ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. పాలనకు గుండెకాయగా ఉన్న సచివాలయంలో నైట్ డ్యూటీ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదని అంటున్నారు. ‘ఈ-ఆఫీస్’ అమలులో ఉండగా నైట్ డ్యూటీ నిర్ణయం తీసుకోవడంలో ఔచిత్యమే లేదని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

నైట్ డ్యూటీ వేయడమంటే ‘ఈ-ఆఫీస్’ విధానం సరిగ్గా పనిచేయడంలేదనే అభిప్రాయపడాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సీఎస్ చెప్పడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. వరదలు, భూకంపాలవంటి అత్యవసర సమయాలలో మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు పని చేస్తుందని, ఇప్పుడు అలాంటి అవసరం లేకున్నా కొనసాగించడంలో అర్థమే లేదని ఓ ఉద్యోగ సంఘం నాయకుడు పేర్కొన్నారు.

మునుపెన్నడూ లేదుగా

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు, అధికారులకు రాత్రి విధులు అమలవుతున్నాయి. షిఫ్టులవారీగా నైట్ డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి అంశానికి సీఎం పేరు చెప్పి ఉన్నతాధికారులే కింది అధికారులు, ఉద్యోగులను భయపడే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు పన్నెండు గంటలపాటు డ్యూటీ చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా అంటున్నారు.

లక్షల రూపాయలలో జీతాలిచ్చే ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం ‘ఈ ఆఫీస్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయినా నైట్ డ్యూటీలు వేయడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. ‘ఈ ఆఫీస్’ ప్రకారం ఉద్యోగి, అధికారి ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించవచ్చని చెబుతున్నారు. ఫిజికల్ ఫైల్ అవసరం లేకుండానే వ్యవహారమంతా జరిగిపోతుంది. ఈ విధానంతో సత్ఫలితాలే వచ్చాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ మొదలు కేంద్రం వరకూ ఇదే పద్దతిని అవలంబిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇది సమర్ధవంతంగా అమలవుతోంది. సెక్షన్ ఆఫీసర్ మొదలు ఐఏఎస్ అధికారి వరకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు ఉంది. ‘ఈ ఆఫీస్’ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చుతో కొత్త కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను కూడా కొనుగోలు చేసింది.

అన్నీ విఫల నిర్ణయాలే

ఇప్పటికే సీఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు ఫెయిల్ అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌ రావు సీఎస్‌కు వినతిపత్రం ఇచ్చారు. అత్యవసర సమయంలో మాత్రమే నైట్ డ్యూటీ వేయాలని, ఇప్పటికే జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతానని అప్పుడు సీఎస్‌ హామీ ఇచ్చారు.

దీని మీద ఉద్యోగ సంఘాలు మరో అభిప్రాయంతో ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో సీఎం కు సంబంధం ఉండదని, చిన్న అంశాలు సీఎం దాకా వెళ్లే అవకాశమే లేదని, ప్రధాన కార్యదర్శే ఉద్దేశపూర్వకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని తామే సీఎం దృష్టికి తీసుకెళ్తే ‘ఈ-ఆఫీస్’ విధానం విఫలమైందన్న అభిప్రాయం ఆయనకు కలుగుతుందని, అది ప్రధాన కార్యదర్శికే చుట్టుకుంటుందని చెబుతున్నారు. చిన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ చేయమన్నట్టుగా చెప్పుకోవడం క్రింది స్థాయి ఉద్యోగులను బెదిరించడమేనని, చివరకు సీఎంను ఉద్యోగ వ్యతిరేకిగా చిత్రీకరించడమేనని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed