వృద్ధి రేటు అంచనాల్లో క్రిసిల్ భారీ కోత!

by  |
వృద్ధి రేటు అంచనాల్లో క్రిసిల్ భారీ కోత!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీగా కోత విధించింది. దాదాపు 9 శాతం మేర కుచించుకుపోనుందని అంచనా వేసింది. మేలో అంచనా వేసిన 5 శాతం ప్రతికూలత అంచనాను సవరిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. 9 శాతం వృద్ధి సంకోచం 1950 తర్వాత అత్యధికమని క్రిసిల్ పేర్కొంది. జాతీయ గణాంకాల శాఖ కొవిడ్-19 కారణంగా అన్ని రంగాలూ దారుణంగా దెబ్బతినడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం మేర క్షీణించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అనేక రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి అంచనాను తగ్గించాయి. గ్లోబల్ రేటింగ్ సంస్థలైన గోల్డ్‌మన్ శాచ్స్ 14.8 శాతం, ఫిచ్ రేటింగ్స్ 10.5 శాతం జీడీపీ వృద్ధి కుదించుకుపోతుందని అంచనా వేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వేత్తలు 16.5 శాతం ప్రతికూల వృద్ధిని అంచనా వేశారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 12 శాతం కుదించుకుపోవచ్చని క్రిసిల్ అభిప్రాయపడింది.

ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. అయితే, ఈ వ్యయం జీడీపీలో 2 శాతం కన్నా తక్కువ. కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం తగినంత ప్రత్యక్ష ఆర్థిక సాయం అందించాలని క్రిసిల్ పేర్కొంది. కరోనాకు ముందునాటి జీడీపీ స్థాయిని సాధించాలంటే రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాలు దేశ సగటు జీడీపీ వృద్ధి ఏడాదికి 13 శాతం పెరగాలని, ఇది భారత్ ఇదివరకెన్నడూ సాధించని ఘనత అవుతుందని క్రిసిల్ వెల్లడించింది.



Next Story