ఢిల్లీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్‌ను తప్పించారు

by  |
ఢిల్లీలో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్‌ను తప్పించారు
X

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డులో గురువారం ఎన్‌కౌంటర్ కలకలం రేపింది. కస్టడీలోని గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ అలియాస్ ఫజ్జాను ఎస్కేప్ చేయడానికి పక్కా ప్లాన్‌తో అతని సహచరులు ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులూ వారిపై ఎదురుకాల్పులు చేశారు. ఈ క్రమంలో వాంటెడ్ క్రిమినల్ కుల్దీప్ ఫజ్జా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో అందరూ స్పాట్ నుంచి పారిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక దుండగుడు హతమవ్వగా ఇంకొకరికి గాయాలయ్యాయి. మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

సినీ ఫక్కీలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ ఉత్తర ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్ ఎదుట మధ్యాహ్నం 12.30 గంటలకు చోటుచేసుకుంది. ఫజ్జాకు చికిత్సనందించడానికి పోలీసులు అతన్ని గురువారం జీటీబీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఫజ్జా, పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలోకి ఎంటర్‌ కాగానే అక్కడికి స్కార్పియో, ఓ బైక్‌పై వచ్చిన ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులూ ఎదురుదాడి చేశారు. కానీ, వాంటెడ్ క్రిమినల్ ఫజ్జా, మిగిలినవారు స్పాట్ నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ఈస్ట్ ఢిల్లీలో పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.

ఉదయమే ఎన్‌కౌంటర్..

జీటీబీ హాస్పిటల్ ఎన్‌కౌంటర్‌కు ముందే గురువారం తెల్లవారు జామున ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ ఏరియాలోనూ ఎన్‌కౌంటర్ జరిగింది. మర్డర్ సహా పలు నేరపూరిత కేసుల్లో నిందితులైన రోహిత్ చౌదరి, అతని ఫ్రెండ్ టిటులు భైరాన్ టెంపుల్ రోడ్‌కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. అక్కడికి వచ్చిన రోహిత్ కారును పోలీసులు అడ్డుకోగానే కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులూ వారి కాళ్లపై షూట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలిసారి ఒక మహిళా పోలీసు అధికారి, ఎస్ఐ ప్రియాంక శర్మ పాల్గొన్నారని, లైఫ్ జాకెట్ ధరించడంతో సురక్షితంగా బయటపడ్డారని క్రైం బ్రాంచ్ ఏసీపీ పంకజ్ వెల్లడించారు.

Next Story

Most Viewed