నకిలీ విత్తనాలు పట్టివేత

by Sridhar Babu |
నకిలీ విత్తనాలు పట్టివేత
X

దిశ, తిరుమలగిరి : నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు బుధవారం పట్టుకున్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి, అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 300 లీటర్ల నిషేధిత గడ్డి మందు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈమేరకు వివరాలు వెల్లడించారు. సుమారు లక్ష 25 వేల విలువైన 52 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, మూడు లక్షల యాబై వేల రూపాయల విలువగల 300 లీటర్ల నిషేధిత గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

తిరుమలగిరి పట్టణానికి చెందిన సంకేపల్లి సోమిరెడ్డి, ఈదుల పర్రె తండకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమర్ అంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రకు భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న నాగ మల్లేశ్వర్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి నుండి తిరుమలగిరికి చెందిన అనంత రెడ్డి నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కోనుగోలు చేసి సోమిరెడ్డి, ప్రేములకు అమ్మగా వారు ఆ విత్తనాలను అధిక ధరలకు రైతులకు అమ్మడం కోసం తీసుకెళ్తూ పట్టుబడినట్టు తెలిపారు. రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. సమావేశంలో సూర్యాపేట డీఎస్పీ రవి, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, తిరుమలగిరి, అర్వపల్లి ఎస్సైలు సత్యనారాయణ, యాకూబ్, సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed