రూ.7 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన డ్రైవర్..

by Disha Web Desk 11 |
రూ.7 కోట్ల విలువైన నగలతో ఉడాయించిన డ్రైవర్..
X

దిశ, ఖైరతాబాద్: నమ్మకంగా ఉంటూ యాజమానిని నట్టేట ముంచాడు ఓ డ్రైవర్. రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో జంప్‌ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ లో నివాసం ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారం చేస్తుంటుంది. వజ్రాభరణాలు అవసరమైన వారికి ప్రముఖ నగల దుకాణాల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తుంటారు. ఆమె వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఉంటుండటంతో అప్పుడప్పుడు కస్టమర్ల ఆర్డర్లను అతడితో పంపించేవారు. ఈ క్రమంలోనే ఆభరణాలపై కన్నేసిన శ్రీనివాస్, అందుకు పథక రచన చేసుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు.

కాగా రాధిక ఉండే అపార్ట్మెంట్ లోనే నివసించే అనూష అనే కస్టమర్ రూ.50 లక్షల విలువైన వజ్రాభరణాలను ఆర్డర్ చేసింది. తీరా ఆర్డర్ డెలివరీ సమయంలో తాను ఇంట్లో లేనని. మధురానగర్ లో ఉన్న తన బంధువుల ఇంట్లో ఉన్నానని చెప్పింది. నగలను తాను ఉన్న వద్దకే పంపాలని కోరారు. దీంతో రాధిక డ్రైవర్ శ్రీనివాస్, సేల్స్ మ్యాన్ అక్షయ్ తో మొత్తం రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలను పంపించారు. అందులో రూ.50 లక్షల విలువ చేసే నగలు అనూషవి కాగా, మిగిలినవి సిరిగిరిరాజ్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ లో తిరిగి ఇవ్వవలసి ఉంది.

మధురానగర్ లోని అనూష బంధువుల ఇంటికి చేరుకున్నాక శ్రీనివాస్ తన పథకాన్ని అమలు చేశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తాను కారులోనే ఉండి, ఆర్డర్ ఇవ్వడానికి అని అక్షయ్ ను ఇంట్లోకి పంపాడు. అతడు కస్టమర్ కు ఆభరణాలు ఇచ్చి వచ్చేలోగా వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. అక్షయ్ ద్వారా విషయం తెలుసుకున్న యజమాని రాధిక వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed