రూ. 40 లక్షల విలువైన హర్యానా మద్యం స్వాధీనం..నిందితులపై కేసు నమోదు

by Disha Web Desk 11 |
రూ. 40 లక్షల విలువైన హర్యానా మద్యం స్వాధీనం..నిందితులపై  కేసు నమోదు
X

దిశ, కుత్భుల్లాపూర్: హర్యానాలోని గుర్ గామ్ నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టు మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పోలీసులు రట్టు చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేటకు చెందిన ఏరువ ఎల్లంకిన్ రెడ్డి(48) అనే వ్యక్తి రాజీవ్ గాంధీనగర్ బాచుపల్లిలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. అతను గురుగాం నుంచి అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేసుకొని నగరం చుట్టు ప్రక్కన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జిల్లా ఎక్సైజ్ అధికారి కె విజయభాస్కర్ ఆదేశాలతో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ కె మాధవయ్య ఆధ్వర్యంలో కుత్భుల్లాపూర్ సీఐ సహదేవ్, సీఐ యాదయ్యలు టీంలతో బాచుపల్లి చౌరస్తా వద్ద రూట్ వాచ్ నిర్వహించారు.

ఈ క్రమంలో హుందాయ్ కారు అనుమానస్పందంగా రావడంతో తనిఖీ చేయగా అందులో హర్యానాకు చెందిన జానీ వాకర్ రెడ్ లేబుల్ 5 కార్టన్లు మద్యం బయటపడింది. దీంతో ప్రధాన నిందితుడైన ఏరువ ఎల్లంకిన్ రెడ్డి, అతని అనుచరులైన నేపాల్ రెడ్డి, ఒంటేరు రాంరెడ్డీలను అదుపులోకి తీసుకొని హర్యానా మద్యం స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం విచారణలో నిందితుడు తెలిపిన వివరాలతో బొల్లారంలోని ఒక గోదాంను అద్దెకు తీసుకొని హర్యాన నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నామని ఒప్పుకోవడం జరిగింది.

నిందితులు సరఫరా చేసిన వారి వివరాలు సేకరించి వారి నుంచి భారీ మొత్తంలో హర్యానా మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం రూ.40లక్షల విలువైన మద్యం, కంటైనర్, కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు ఛేదించిన వారిలో ఎస్ఐలు అనిల్ కుమార్, సలీం, షర్మిల , టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కుత్భుల్లాపూర్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. అక్రమ మద్యం సరఫరా కేసును చాక చక్యంగా పట్టుకున్న పోలీసులను జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అభినందించారు.

Next Story

Most Viewed