గొర్రెల మందు కావాలంటూ వచ్చి మహిళ మెడలో గొలుసును లాక్కెళ్లిన వ్యక్తుల అరెస్ట్

by Disha Web Desk 11 |
గొర్రెల మందు కావాలంటూ వచ్చి మహిళ  మెడలో గొలుసును లాక్కెళ్లిన వ్యక్తుల అరెస్ట్
X

దిశ, మహేశ్వరం: గొర్రెలకు మందు కావాలంటూ ఓ మహిళా ఉద్యోగస్తురాలు మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు. మహేశ్వరం ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం బీఎన్ రెడ్డి శ్రీనివాస పురం కాలనీకి చెందిన తెప్పా శివకుమార్ (25), వనస్థలిపురం విజయపురి కాలనీకి చెందిన వోలుగుమన్ను గజేంద్ర(23) ఇద్దరు స్నేహితులు. కాగా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బచర్ల గ్రామంలో మే 4 వ తేదీన వెటర్నరీ హాస్పిటల్ లోకి ఇద్దరు వెళ్లి అటెండర్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగస్తురాలుతో గొర్రెలకు మందు కావాలని చెప్పారు.

దీంతో ఆమె లోపలికి వెళ్లి గొర్రెల మందు ఇస్తున్న సమయంలో మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కెళ్లారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 8వ తేదీన మన్సాన్ పల్లి చౌరస్తాలో మహేశ్వరం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్ పైన అనుమానాస్పదంగా ఉన్న వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో బంగారం గొలుసు దొంగతనం చేశామని నిందితులు ఒపుకున్నారు. మహిళలు వ్యవసాయ పొలాల వద్ద పనులు చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అడ్రస్ అడిగే సమయంలో అలర్ట్ గా ఉండాలని ఏసీపీ అంజయ్య సూచించారు.

Next Story