దయచేసి నా దేశాన్ని కాపాడండి.. ఆఫ్ఘాన్ క్రికెటర్ ఆవేదన

by  |
Rashid Khan, Taliban terrorists
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ తీవ్రవాదుల అకృత్యాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆఫ్ఘాన్ నుంచి విదేశీ బలగాలు వెనుదిరిగిన మరుక్షణమే భయంకరమైన కాల్పులకు తెగబడ్డారు. రోజూ మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా దాడులకు తెగబడుతూ విచక్షణారహితంగా కాల్పులు జరిపి, వందలమందిని పొట్టనపెట్టుకుంటున్నారు. దీంతో దీనిపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందించాడు. ‘‘దయచేసి నా దేశాన్ని కాపాడండి’’ అంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాడు. దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా పిల్లలు, మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితుల నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేసుకున్నాడు.

తాజాగా.. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ప్రపంచ నేతలారా.. నా దేశం అల్లకల్లోలంలో ఉంది. పిల్లలు, మహిళలు సహా వేలాది మంది అమాయక ప్రజలు ప్రతిరోజు చనిపోతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రాయులయ్యాయి. మమ్మల్ని ఈ కల్లోలంలోనే వదిలేయకండి. ఆఫ్ఘన్ ప్రజలను చంపడాన్ని, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుగుతున్న దాడిని అడ్డుకోండి. మాకు శాంతి కావాలి’’ అని ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది.



Next Story