సీపీఎస్ ఉద్యోగుల పోరుబాట..?

by  |
సీపీఎస్ ఉద్యోగుల పోరుబాట..?
X

మార్చి 1న మహాధర్నాకు నిర్ణయం.!
టీఎన్జీవోలపై నమ్మకం సన్నగిల్లి..టీఈఏ ఆధ్వర్యంలో..

కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరకపోగా..ఇప్పటికీ ఉద్యోగులు సీపీఎస్ విధానంలోనే వేతనాలు పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారు లక్షన్నర దాకా ఉద్యోగులు ఇంకా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం కిందే కొనసాగుతున్నారు. ఈ పథకం వల్ల తమకు ఉద్యోగ భద్రతతోపాటు పదవీ విరమణ తర్వాత సరైన పెన్షన్ దక్కదని, దీనివల్ల తమ కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి, తమకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
సీపీఎస్ రద్దును కోరుతూ గతేడాది వేలాది మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించారు. అయితే సీపీఎస్ రద్దు అంశాన్ని సంబంధిత రాష్ట్రాలే తేల్చాలని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ సీపీఎస్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు విధి విధానాల కోసం మంత్రులతో కమిటీని వేశారు. కానీ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలేకపోవడం, ముఖ్యమంత్రి సైతం స్పందించక పోవడం పట్ల సీపీఎస్ ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సీపీఎస్ రద్దు గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కనీసం స్పందించకపోవడం గమనార్హం. దీంతో సీపీఎస్ ఉద్యోగులు పోరుబాట పట్టేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సీపీఎస్ రద్దుపై ఇంతకాలం ఉద్యోగులతో కలిసి పనిచేసిన టీఎన్జీవోల సంఘం ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా మారిందన్న ఆగ్రహం సీపీఎస్ ఉద్యోగ సంఘాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీఎన్జీవోలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
సీపీఎస్ ఉద్యోగ సంఘాల్లోనూ వర్గపోరు ఉన్న నేపథ్యంలో.. ప్రధాన వర్గం టీఈఏ ఆధ్వర్యంలోనే సీపీఎస్ రద్దు కోసం పోరాటం ఉధృతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు సీపీఎస్ ఉద్యోగుల సంఘం సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఈ మేరకు మార్చి 1వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సీపీఎస్ ఉద్యోగుల మహాధర్నాతో పాటు ఉపవాస దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి అనుమతి కోరుతూ టీఈఏ ఆధ్వర్యంలో ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సీపీఎస్ ఉద్యోగులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులను పెద్ద ఎత్తున తరలించి మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం యోచిస్తున్నది.


Next Story

Most Viewed