కమ్యూనిస్టుల కంచుకోటలో సున్నా ఓట్లతో సీపీఎం రికార్డు

by  |
CPM
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : మూడున్నర దశాబ్దాల పాటు నకిరేకల్ నియోజకవర్గాన్ని సీపీఎం ఏకచక్రాధిపత్యంగా ఏలింది. సీపీఎం సీనియర్ నేత, నర్రా రాఘవరెడ్డి, నోముల నర్సింహయ్యలు ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేలుగా దాదాపు 35 ఏండ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో నకిరేకల్ నియోజకవర్గానికి మినీపశ్చిమబెంగాల్‌గా గుర్తింపు పొందింది. 2009 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉంది. కానీ అప్పటి నుంచి సీపీఎం రోజురోజూకీ దిగజారుతూ వస్తోంది.

తాజాగా నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎంకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. కేవలం మూడు వార్డుల్లో మాత్రమే సీపీఎం పోటీ చేసింది. వారు సైతం కనీస పోటీని ఇవ్వలేకపోయారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఐదో వార్డులో సీపీఎం నుంచి పోటీ చేసిన పనికెర కృష్ణమోహినికి ఒక్కటంటే ఒక్క ఓటు పడలేదు. కనీసం ఆమె ఓటు కూడా ఆమె వేసుకోలేకపోయింది. ఎందుకంటే.. కృష్ణమోహిని పోటీ చేసింది ఐదో వార్డులో కాగా, ఆమెకు ఒకటో వార్డులో ఓటు ఉంది. దీంతో ఆమెకు వచ్చిన ఓట్లు సున్నా కావడంతో రికార్డుగా మిగిలింది. మరో అభ్యర్థి సీపీఎం పార్టీ నుంచి ఒకటో వార్డులో సాకుంట్ల నర్సింహా పోటీ చేశారు. ఈ వార్డులో మొత్తం 1003 ఓట్లు ఉండగా, 891 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సీపీఎం అభ్యర్థి సాకుంట్ల నర్సింహాకు కేవలం 44 ఓట్లు మాత్రమే దక్కాయి.

పదో వార్డులో సీపీఎం నుంచి చెన్నబోయిన నాగమణి పోటీ చేసింది. ఈ వార్డులో మొత్తం 989 ఓట్లు ఉంటే, 854 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సీపీఎం అభ్యర్థిని నాగమణికి కేవలం 4 ఓట్లు మాత్రమే దక్కాయి. మొత్తంగా నకిరేకల్‌ను శాసించిన సీపీఎం.. నకిరేకల్ మున్సిపాలిటీలో 20వేల పైచిలుకు ఓట్లు ఉంటే.. మొత్తం ఆ పార్టీకి కేవలం 48 ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం.



Next Story

Most Viewed