'కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేందుకే మోడీ ప్రభుత్వం ఉంది'

by  |
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేందుకే మోడీ ప్రభుత్వం ఉంది
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చర్చ లేకుండా కేంద్రం బిల్లులు పాస్ చేసుకుంటోందని ఆరోపించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విధానం పై‌ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా టైంలో అంబానీ, అదానీలు ఆస్తులు మాత్రమే రెట్టింపు అయ్యాయన్నారు. 2014 ముందు అదానీ ఎవరని?.. ఇప్పుడు టాప్ బిలియనర్ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.62 మాత్రమే ఉందని.. ఇప్పుడు రూ.108కి చేరినా కేంద్రంలో చలనం లేదని విమర్శించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగిపోతున్నాయని రోడ్డెక్కారని ఇప్పుడేం చేస్తారని నిలదీశారు. బ్లాక్ మార్కెట్‌కు ఈ ప్రభుత్వం అమ్ముడుపోయిందన్నారు. కనీసం వ్యాక్సిన్‌ను కూడా సకాలంలో అందించలేక చతికిల పడిందని విమర్శించారు.

మరోవైపు బీజేపీ చేస్తున్న జన ఆశీర్వాద యాత్రపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేయాల్సింది జన ఆశీర్వాద యాత్ర కాదని జన వంచన యాత్ర చేయాలని హితవు పలికారు. విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని..అన్నీ చేసినట్లు కిషన్‌రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఏపీ కోసం మాట్లాడే ఒక్క బీజేపీ నాయకుడు కూడా లేడా అని ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మోదీ ఏపీకి చేసినంత అన్యాయం.. దేశంలో ఎక్కడా చేయలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు నోళ్లు తెరిచి వాస్తవాలు చెప్పాలని కే. రామకృష్ణ హితవు పలికారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీలో త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కలిసి వచ్చే పక్షాలతో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పుడైనా బీజేపీ నేతలు నోళ్లు తెరిచి.. వాస్తవాలు చెప్పాలని రామకృష్ణ తెలిపారు.

అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ అన్నారు. రూ.47లక్షల కోట్ల అప్పు నుంచి రూ.119లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదని ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని కే. రామకృష్ణ ఆరోపించారు.



Next Story

Most Viewed