ప్రజాసమస్యలపై సీపీఐ ఒకరోజు ఉపవాస దీక్ష

by  |

దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్డున పడ్డ అసంఘటిత కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పలు ఆంశాలు వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులను స్వస్థలాలకు పంపించాలని కోరారు. అసంఘటిత కార్మికుల, చేతి వృత్తిదారుల కుటుంబాలకు రూ.7వేలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. మధ్యాహ్నా భోజన కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్, స్కీం వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు చెల్లించాలన్నారు. రైతులు పండించిన పంటను తరుగు పేరుతో కిలోలకు..కిలోలు కోతలు కోయడం పై చర్యలు తీసుకోవాలనీ, వడగండ్లతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి ఎవరి ఇళ్లలో వారే ఒకరోజు ఉపవాస దీక్ష చేయాలని చాడ వెంకట్‌రెడ్డి పిలుపు‌నిచ్చారు. హైదరాబాద్‌లో రాష్ట్ర సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్టు చాడ తెలిపారు.

Tags: Venkat Reddy,Narayana, hyderabad,Cpi office, Lockdown, Market, Farmer, Paddy

Next Story

Most Viewed