పరిస్థితులు వెంటనే చక్కదిద్దండి.. చాడ వెంకట్ రెడ్డి హెచ్చరిక

by  |
CPI leader Chada Venkat Reddy
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ, ఆంధ్రా ముఖ్యమంత్రులు జల జగడాలు ఆడుతున్నట్లు నాటకమాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో సాధించుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఐ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా చౌరస్తా వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాలను కర్ణాటక ప్రభుత్వం దోచుకుంటే పట్టించుకోకుండా ఆంధ్రా-తెలంగాణ ముఖ్యమంత్రులు నీటి కోసం ఎప్పుడు దొంగ నాటకాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు.

ఈ నాటకాలన్నీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు ఎంతమాత్రం కాదని ఆయన చెప్పారు. నీళ్ల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఇది ఎంతమాత్రం సహించరాని విషయం అన్నారు. ఇలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారడం ఖాయం అన్నారు. వెంటనే పరిస్థితులను చక్కదిద్దకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనరసింహ, ఉమ్మడి జిల్లా కార్యదర్శులు పరమేశ్వరి గౌడ్, విజయ రాములు, కొండన్న, ఆంజనేయులు, వెంకటయ్య, ఆనంద్ పాల్గొన్నారు.



Next Story