బస్తీ బతుకులు మారేనా?

60

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ అందరికీ ఒకేలా ఉన్నా బతుకులు అందరివీ ఒకేలా ఉండవు. అక్కడ 80కి పైగా కుటుంబాలు నివసిస్తాయి. చిన్నా,పెద్ద అందరినీ కలుపుకొని దాదాపు 600 మందికి పైగా జనం. కానీ ఏడాదిన్నర కాలంలో కనీసం ఒక్కరంటే ఒక్కరికీ కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వలేదు. టీవీలో చూడటమే తప్పా తమకసలు కొవిడ్ పరీక్షలంటే ఏంటో తెలియదు. చుట్టూ కాంక్రీట్ జంగిల్. మధ్యలో చిన్న గుడిసెలు. అందులోనే ఎలుకలు, బొద్దింకలు, కీటకాలతోనే వారి సావాసం. అయినా కరోనాను ఎదుర్కోవడంలో మాత్రం వారు సక్సెస్ అయ్యారు. కానీ వారి జీవితాలు మాత్రం నేటికీ గుడిసెల్లోనే మగ్గుతున్నాయి. గూడు కట్టిస్తామన్న ప్రభుత్వం హామీలిచ్చి ఏండ్లు దాటుతున్నా నేటికీ నెరవేర్చడంలేదు. వారి జీవనస్థితిలోనూ ఎలాంటి మెరుగుదల కనిపించడంలేదు. ఓట్ల సమయంలో అవసరానికి వచ్చే నాయకులు ఎలక్షన్ అయిపోతే తమ వైపు కన్నెత్తి కూడా చూడరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోతీనగర్ సమీపంలోని సారథినగర్ బస్తీవాసులు.

మూడు తరాలు మారినా తీరు మారలేదు..

హైదరాబాద్లోని మోతీనగర్ సమీపంలో ఉన్న సారథినగర్ మురికివాడల్లో గత యాభై ఏండ్లుగా నివాసముంటున్నారు అక్కడి ప్రజలు. మూడు తరాలు మారి నాలుగో తరం వచ్చినా తమ బతుకులు మారలేదని ఆవేదన చెందుతున్నారు బస్తీవాసులు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికీ వారి స్థితిగతులు మాత్రం మారలేదు. ఎన్నికల సమయంలో తప్పా తాము నాయకులకు గుర్తుకురామని చెబుతున్నారు. మీకు ఇండ్లు కేటాయిస్తామని ఆశ చూపి ప్రచారం కోసం వాడుకొని ఆపై ముఖం చాటేస్తారని తమ గోడును వెలిబుచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమను పట్టించుకున్న నాథుడే లేడని వారు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఏ పని లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోతీనగర్ మురికి వాడల్లో నివసించే ప్రజలు చెబుతున్నారు.

పని దొరక్క పస్తులు..

కొవిడ్ కారణంగా ఎంతో మంది బస్తీవాసులు ఉపాధి కోల్పోయి వారి బతుకులు రోడ్డునపడ్డాయి. తిందామంటే బుక్కెడు కూడు కూడా దొరకని పరిస్థితి. అలాంటి వారికి ‘అన్నపూర్ణ’ భోజనమే దిక్కయింది. అయితే అది కూడా మధ్యాహ్నం మాత్రమే దొరకడంతో మిగిలిన రెండు పూటలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక సామగ్రి అమ్ముకుంటేనే వారి నోట్లో నాలుగు వేళ్లు వెళ్లేది. అలాంటిది వారి పాలిట లాక్ డౌన్ ఒక శాపంలా మారింది. చేద్దామన్నా పనిలేక అష్టకష్టాలు పడుతున్నారు అక్కడి బస్తీవాసులు. ఉన్నా వారికి పనిచ్చే వారు కూడా కరువయ్యారు. చేసేదేమీ లేక ఒక్క పూట మాత్రమే తిని రెండు పూటలు పస్తులుంటున్నారు సారథినగర్ బస్తీ వాసులు. మధ్యాహ్నం సమయంలోనే రాత్రికి కూడా భోజనం తెచ్చుకుందామన్నా అది రాత్రి వరకు కుళ్లిపోతోంది. దీంతో ఇంట్లో పిల్లలను పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అప్పుడప్పుడు దాతల ఆపన్నహస్తం..

లాక్ డౌన్ సమయంలో బస్తీవాసుల కష్టాలను చూసి చలించిపోయారు పలువురు దాతలు. వారికి అప్పుడప్పుడు భోజనం ప్యాకెట్లు అందిస్తూ వారి ఆకలిని తీర్చుతున్నారు. అయితే వారు అందించిన భోజనంలో కొంత మిగుల్చుకొని ఇంకో పూటకు తిందామన్నా.. పెద్దలు కడుపు మాడ్చుకుని పిల్లలకు పెడదామన్నా కుళ్లిపోతుండటంతో వారికి ఇబ్బందిగా మారుతోంది. అన్నం లేక అక్కడి చిన్నారులు రోడ్డు పక్కన పడి ఉన్న పండ్లను తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాతలెవరైనా తమకు సాయం చేయాలనుకుంటే బియ్యం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు సారథినగర్ బస్తీవాసులు. అలాగైనా తమ పిల్లల కడుపు నింపేందుకు అవకాశం దొరుకుతుందని వారు చెబుతున్నారు.

మూడేళ్లయినా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వలేదు

80కి పైగా కుటుంబాలు నివాసముండే సారథినగర్ మురికివాడలో ఒక్కటంటే ఒక్క టాయిలెట్ కూడా లేకపోవడం గమనార్హం. 600 మందికి పైగా ప్రజలు అక్కడ నివసిస్తుండగా ఆడ, మగ అందరూ మల, మూత్ర విసర్జనకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ఆడవారికి మగవారి నుంచి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ గుడిసెలకు ఆనుకుని ఉన్న ప్రదేశంలోనే బహిర్భూమికి వెళ్తుండటంతో ఆ ప్రాంతంలో ఈగలు, దోమల వ్యాప్తి పెరిగిపోయింది. సొంతంగా మరుగుదొడ్లు కట్టుకునే స్థోమత వారికి లేదు. ప్రభుత్వం కట్టిస్తామని హామీ ఇచ్చి పనులు ప్రారంభించి మూడేళ్లయినా నేటికీ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. సగంలోనే పనులు నిలిపివేశారు.

ఒక్క పాజిటివ్ కేసు లేదు..

సారథినగర్ లోని మురికివాడల్లో 600 మందికి పైగా జనం నివసిస్తున్నారు. అందులో ముసలివాళ్ల సంఖ్య కూడా అధికమే. బయటకు వెళ్లి ఏదో ఒక పని చేస్తే కానీ తిండి దొరకదు. కరోనా విజృంభణ మొదలై ఏడాదిన్నర అవుతున్నా ఆ బస్తీలో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వలేదు. కనీసం వారిలో కరోనా భయం కూడా కనిపించకపోగా అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. టీవీల్లో చూడటమే తప్పా కొవిడ్ టెస్టులంటే వారికేంటో కూడా తెలియదు. వ్యాక్సినేషన్ గురించి అస్సలే అవగాహన లేదు. వాళ్లకు కరోనా టెస్టులు లేవు, మందులిచ్చే నాథుడే లేడు. అసలు బతికి ఉన్నారా లేదా అని ఆరాతీసే దిక్కులేదు. అయితే ఏడాదిన్నర కాలంలో ఇటీవల ఆశ వర్కర్లు వచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చినట్లు వారు చెబుతున్నారు. అయితే అవి వేసుకున్న కొందరు అస్వస్థతకు గురైనట్లు టీవీలో చూడటంతో భయానికి అవి కూడా వేసుకోవడం లేదంటున్నారు బస్తీవాసులు.

పిల్లల చదువులు ఆగం

ఒక్కో కుటుంబానికి కనీసం నలుగురికి పైగా పిల్లలు ఉన్నారు. అందులో బడీడు పిల్లల సంఖ్యే అధికం. లాక్ డౌన్ కు ముందు వారంతా పాఠశాలకు వెళ్లేవారు. ఎక్కువ శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. అయితే అందులో కొందరు పిల్లలను పలువురు దాతలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నారు. అయితే ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పిల్లల చదువులు అటకెక్కాయి. పిల్లలందరూ ఆటకే ఎగబడుతున్నారు. అందరూ ఇంటికే పరిమితం కావడంతో ఇప్పటి వరకు చదువుకున్నదంతా మరిచిపోయినట్లు చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇండ్లెప్పటికి వచ్చేనో..

తమ తాతల కాలం నాటి నుంచి సారథి నగర్ మురికివాడల్లోనే జీవిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా తమ జీవితాలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. నాయకులంతా ఎన్నికలప్పుడు వచ్చి పనిచేయించుకుంటున్నారే తప్పా పట్టించుకున్నోళ్లే లేరని వాపోతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చినా నేటికీ నెరవేర్చలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను అడిగినా ఇదిగో.. అదిగో అంటూ రోజులు వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు నిలదీయడంతో లింగంపల్లి సమీపంలో బీరంగూడ వద్ద ఇండ్ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పినా అక్కడ నివసించేందుకు మాత్రం తమకు అనుమతి ఇవ్వడంలేదని బస్తీవాసులు చెబుతున్నారు. మురికివాడల నుంచి పెళ్లి చేసుకున్న వారు తిరిగి రావాలంటే ధైర్యం కూడా చేయడంలేదంటున్నారు.

పింఛన్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు

వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసి నాలుగేండ్లు దాటింది. ఇప్పటి వరకు రాలేదు. నాకు చదువు రాదు. ఇతరులతో దరఖాస్తు నింపించాను. ఆ సమయంలో 35 ఏండ్లు అని రాయడం వల్ల పింఛన్ రావడం లేదని అధికారులు చెప్పారు. అది మార్చాలంటే డబ్బులు ఖర్చవుతుందంటే ఒక మధ్యవర్తికి రూ.3000 నగదు ఇచ్చాను. అయినా కూడా మార్చడం లేదు. నా భర్త చనిపోయి చాలా ఏండ్లు అవుతోంది. వృద్ధాప్య పింఛన్ కాకపోయినా విడో పింఛన్ అయినా ఇప్పించాలని కోరాను. అయినా స్పందన లేదు.

– అంబు బాయి, సారథి నగర్ బస్తీ

ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదు

ఎన్నికల సమయంలో మాత్రేమ మేము ఎమ్మెల్యేకు గుర్తుకువస్తాం. జెండాలు మోయాలి. స్టిక్కర్లు అతికించాలి. ఇంటింటికీ తిరగి ప్రచారం చేయాలి. అలా చేసినందుకు డబ్బులిస్తామన్నా కూడా మేమే వద్దని చెబుతున్నాం. మాకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటివరకు ఇండ్లు అందలేదు. అధికారులు, నాయకులు మా ఆశలతో ఆడుకుంటున్నారు. ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయి.. అని ఆశచూపుతున్నారు తప్పా ఒక్కరూ మమ్ముల్ని ఆదుకున్న పాపాన పోలేదు.

– శాంతు, బస్తీవాసి

ఈగలు, దోమలతో సతమతం

ప్రభుత్వం మరుగుదొడ్లు కట్టిస్తామని చెప్పి కొన్నేళ్ల క్రితం పనులు ప్రారంభించింది. నిర్మాణం పూర్తయితే ఆడవాళ్లకు ఇబ్బందులు తప్పుతాయని అందరం భావించాం. ఎందుకో తెలియదు పనులు నిలిపివేశారు. మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆడ, మగ అందరూ మల, మూత్ర విసర్జనకు బయటకే వెళ్తున్నాం. టాయిలెట్లు లేకపోవడం ఆడవాళ్లకు చాలా ఇబ్బందిగా మారింది. ఈగలు, దోమలతో సతమతమవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవచూపి వీలైనంతా త్వరలో మరుగుదొడ్లు కట్టించాలి.

– చంద్రమ్మ, సారథి నగర్ బస్తీ

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి

లింగంపల్లి సమీపంలోని బీరంగూడ వద్ద తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. అక్కడ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా రోజులైంది. కానీ అక్కడికి వెళ్లి ఉండేందుకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. నిజానికి అక్కడ అసలు ఇండ్ల నిర్మాణం చేపట్టారా.., లేదా అని అనుమానంగా ఉంది. ఉంటే ఇప్పటి వరకు ఎందుకు వెళ్లనీయడంలేదు. ఒక వేళ కడితే మాకు కాదని వేరే వాళ్లకు ఆ ఇండ్లను ఇస్తున్నారా. మాకు ప్రభుత్వం వెంటనే ఇండ్లు ఇవ్వాలి. అయితేనే మా బతుకులు బాగుపడతాయి.

-నిర్మల, సారథి నగర్ బస్తీ

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..