ఫేక్ కరెన్సీ ప్రింటింగ్.. వాళ్లనే టార్గెట్ చేస్తున్న కిలాడీ జంట

by  |
ఫేక్ కరెన్సీ ప్రింటింగ్.. వాళ్లనే టార్గెట్ చేస్తున్న కిలాడీ జంట
X

దిశ ప్రతినిధి, వరంగల్ : యూట్యూబ్ చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న దంపతులను వరంగల్ టాస్క్‌ఫోర్స్, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు. అరెస్టు చేసిన దంపతుల నుంచి సుమారు రూ. 10 ల‌క్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే కరెన్సీ ముద్రణ‌కు వినియోగించిన కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించిన వివ‌రాల ప్రకారం.. వ‌రంగ‌ల్ కాశిబుగ్గ, తిలక్ రోడ్ ప్రాంతానికి చెందిన దంపతులు వంగరి రమేష్(55) సరస్వతి(45) దంప‌తులు కొంత‌కాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డుతున్నారు. కాశిబుగ్గ ప్రాంతంలోనే రమేష్ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. భార్య సరస్వతి ఫ్యాన్సీ దుకాణంతో పాటు మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తోంది. అయితే కొంత‌కాలంగా ఆర్థిక ఇబ్బందులు మొద‌లు కావ‌డంతో.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో న‌కిలీ క‌రెన్సీని త‌యారు చేయ‌డం ఎలాగో యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే క‌ల‌ర్ ప్రింట‌ర్‌ను వినియోగిస్తూ.. నకిలీ నోట్లను ముద్రించి వాటిని రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయ‌డం మొద‌లుపెట్టారు. కరెన్సీ ముద్రణ‌కు అవసరమైన బాండ్ పేపర్ల కాగితాన్ని వినియోగిస్తున్నారు. అసలు కరెన్సీకి సంబంధించిన 2వేలు, ఐదువందలు, రెండువందలు, వంద, యాభై, ఇరువై, పది రూపాయలకు సంబంధించిన కొత్త, పాత నోట్లను ముందుగా స్కానర్‌తో స్కాన్ చేసిన త‌ర్వాత వాటిని ప్రింట‌ర్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించేవారు. ముద్రించిన నకిలీ కరెన్సీని హన్మకొండ, వరంగల్‌లో రద్దీగా ఉండే షాపుల్లో ఈ నకిలీ నోట్లను చెలామ‌ణి చేయ‌డం మొద‌లుపెట్టారు.

కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి అవుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు దృష్టిపెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం టాస్క్‌ఫోర్స్, ఇంతేజాగంజ్ పోలీసులు సంయుక్తంగా నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ఈ సందర్భంగా దంప‌తుల‌పై కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న దంపతులను పట్టుకోవడంలో ప్రతిభ కనిబరిచిన పోలీసులను టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రతాప్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, మధు, ఇంతేజా గంజ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు శ్రీకాంత్, మహేందర్, సృజన్, చిరులతో పాటు ఇంతేజార్ గంజ్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Next Story

Most Viewed