ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడితే తలా తోక ఉండదు: గుత్తా

by  |
ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడితే తలా తోక ఉండదు: గుత్తా
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడితే తలా తోక ఉండదని, ఆయన నోట అసత్యాలు, అబద్దాలు తప్ప మరో మాట రాదని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని, దీనిపై కాంగ్రెస్ కావాలనే రాద్దాంతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్‌బీసీని పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చాక రూ.943కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటివరకు 33కిలో మీటర్ల సొరంగం పూర్తి చేసిందన్నారు. అప్పుడు మంత్రులుగా కొనసాగిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని గుర్తుచేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, డిండి ఎత్తిపోతల పథకంతో దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు సంబంధించి సొరంగం తవ్వాల లేక లిఫ్ట్ ఏర్పాటు చేయాలనేదానిపై అప్పటి సీఏం చంద్రబాబు ఆరుగురితో కమిటీ వేశారని, ఆ కమిటీ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని సూచించిందని, పనులు కూడా ప్రారంభించారని గుర్తుచేశారు. కానీ వైయస్ హాయాంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తెలంగాణ వారు గొడవ చేస్తారని శ్రీశైలం సొరంగం పనులు కూడా ప్రారంభించారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే శ్రీశైలం సొరంగం పనుల మీద అసెంబ్లీ కమిటీ హాల్‌లో అన్ని పక్షాలతో సీఎం కేసీఆర్ సమీక్ష చేశారని వివరించారు. ఇప్పుడు విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించలేదని ప్రశ్నించారు.



Next Story

Most Viewed